ధర్మవరం టౌన్:ఓటు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆర్డీవో తిప్పేనాయక్ బిఎల్ఒలకు తెలిపారు. పట్టణంలోని ఆర్డీవో సమావేశ భవనంలో శుక్రవారం నాడు బీఎల్ఒలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణకై ముందస్తు కార్యక్రమాలు, సవరణ సమయంలో రెండు రకాల కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ఇప్పటికే అవసరమైన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జులై 20వతేదీ వరకు దీనిని కొనసాగించాలని తెలిపారు. జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు బిఎల్ఒలు ఇంటింటా ఓటర్ల పరిశీలన కార్యక్రమాలను నిర్వహించాలని, ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 29 వరకు పోలింగ్ స్టేషన్లలో క్రమబద్దీకరణ తదితర కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు 8 రకాల ఫార్మెట్లను రూపొందించడం జరుగుతుందన్నారు. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ సమయంలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 17న సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, అక్టోబర్ 17 నుంచి నవంబర్ 30 వరకు క్లయిములు అభ్యంతరాల స్వీకరణ చేయాలని తెలిపారు. అక్టోబర్ 28, 29, నవంబర్ 18,19 తేదీల్లో బూత్ స్థాయిలలో క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. డిసెంబర్ 26 నాటికి క్లయిములు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 1వతేదీన తుది జాబితా ప్రచురణకు కమిషన్ అనుమతి పొందడం జరుగుతుందని తెలిపారు. జనవరి 5వతేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. 2024 జనవరి 1వతేది నాటికి 18 సంవత్సరాలు వయసు నిండిన యువతీ, యువకులు నూతన ఓటర్లుగా నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ యోగేశ్వరిదేవి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎన్నికల ఉప తహసీల్దార్ అనిల్ కుమార్, బిఎల్ఒలు పాల్గొన్నారు.










