Jan 07,2023 20:43

మాట్లాడుతున్న జిల్లా రెవెన్యూ అధికారి సి. వెంకటనారాయణమ్మ

మాట్లాడుతున్న జిల్లా రెవెన్యూ అధికారి సి. వెంకటనారాయణమ్మ

ఓటరు జాబితాపై అభ్యంతరాలు తెలియజేయాలి
ప్రజాశక్తి-నెల్లూరుజిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితా పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా రెవెన్యూ అధికారి సి. వెంకటనారాయణమ్మ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్‌ ఎస్‌ ఆర్‌ శంకరన్‌ వీసీ హాల్లో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశాన్ని జిల్లా ఎన్నికల అధికారి కెవిఎన్‌ చక్రధర్‌ బాబు ఆదేశాల మేరకు డిఆర్‌ఓ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకారం జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గాల జాబితాను గత ఏడాది డిసెంబర్‌ 30వ తేదీన ప్రచురించినట్లు తెలిపారు.
ఆ జాబితా ప్రకారం జిల్లాలో 1,03,969 మంది పట్టభద్రుల నియోజకవర్గానికి, 7713 మంది ఉపాధ్యాయుల నియోజకవర్గానికి ఓటర్లుగా నమోదయ్యారన్నారు. ఓటర్ల జాబితా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశామని, అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫారం-7 లోను, చేర్పులు మార్పులు ఉంటే ఫారం-8లోను దరఖాస్తులు అందజేయాలన్నారు. జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గానికి 76 పోలింగ్‌ కేంద్రాలు, ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 36 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అనుబంధ పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా అర్హులైన వ్యక్తులు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలంటే పట్టభద్రులకైతే ఫారం-18 లోను, ఉపాధ్యాయులు అయితే ఫారం-19 లోను దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా నిరంతరం తాజాగా రూపొందించడం జరుగుతుందని ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950 ప్రకారం ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసుకునే చివరి రోజు వరకు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకొనుటకు అవకాశం ఉందన్నారు. అయితే శాసనమండలి నియోజకవర్గాల జాబితాలో పేర్లు చేర్చుటకు నామినేషన్లు దాఖలు చివరి తేదీకి పది రోజులు ముందుగా అందిన దరఖాస్తులను పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం కింద ఈనెల 5వ తేదీన చివరి ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగిందన్నారు.అందులో ఓటర్లు-జనాభా నిష్పత్తి, స్త్రీ- పురుషుల లింగ నిష్పత్తి సజావుగా ఉండేలా అందరూ సహకరించాలన్నారు. యువతను విస్తతంగా జాగ్రత్తపరిచి ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఈఆర్వోలు నగర కమిషనర్‌ డి హరిత, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవోలు ఏ మలోల, సీనా నాయక్‌ కరుణ కుమారి, వైసిపి ప్రతినిధి మురళీధర్‌ రెడ్డి, టిడిపి ప్రతినిధి చేజెర్ల వెంకటేశ్వర్‌ రెడ్డి,బిజెపి ప్రతినిధి కాళేశ్వరరావు, సిపిఎం ప్రతినిధి మోహన్‌ రావు, సిపిఐ ప్రతినిధి సిరాజ్‌, బీఎస్పీ ప్రతినిధి బి రాజా,ఎన్‌ సి పి ప్రతినిధి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.