జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రద్యుమ్న పి.యస్
ప్రజాశక్తి - రాయచోటిహొ: జిల్లాలో నిర్వహిస్తున్న 2023 ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాలో నమోదైన ఈపి, జెండర్ రేషియోలను పక్కగా పరిశీలించాలని ఏపీ మార్కెఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రద్యుమ్న ఆర్డీఓలను, తహశీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ కలిసి ఓటర్ల జాబితాకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాబితా రూపకల్పనకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ ఎన్నికల పరిశీలకులకు వివరించారు. జిల్లాలో మొత్తం 13,47,044 ఓటర్లు ఉన్నారని ఎలక్టోరల్ పాపులేషన్ రేషియో 698 గా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ కు సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు 34,927 విజ్ఞప్తులు అందగా 20977 అంగీకరించామని, 8260 విజ్ఞప్తులను తిరస్కరించామని తెలిపారు. ఇప్పటివరకు ఫారం-6లో 23396 దరఖాస్తులు రాగా, 15287 అంగీకరించామని,4503 తిరస్కరించినట్లు తెలిపారు. ఫారం7 కు సంబంధించి 3848 దరఖాస్తులలో 2280 అంగీకరించగా 174 తిరస్కరించారని, ఫారం 8లో 6860 దరఖాస్తులకు 3725 అంగీకరించగా 2695 తిరస్కరించినట్లు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రద్యుమ్న పియస్ మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేసేందుకు రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించాలన్నారు. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా తగు పరిశీలన చేసి పరిష్కరించాలన్నారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల పై అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలపాలన్నారు. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఒకే రకమైన రెండు ఫొటోలు, డూప్లికేట్ ఓటర్లను పక్కాగా తొలగించాలని, ఈ విషయంలో ఆర్‌డిఒలు, తహశీల్దార్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 18-19 వయసులో ఉన్న యువత కొత్త ఓటర్లుగా నమోదు అయ్యేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అన్ని రాజకీయ పార్టీలకు నాయకులకు ఓటర్ లిస్టు అందజేయాలన్నారు. ఫామ్ 6 తక్కువగా వస్తున్నాయని, నియోజకవర్గాల వారీగా జిల్లాలో అర్హులైన ఓటర్లు వందశాతం నమోదు కావాలని ఇందుకు సంబంధించి ఓటర్ల చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే గ్రామాలలో దండోరా వేయించాలని, ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసి ఓటర్ల నమోదు పెరిగేందుకు కషి చేయాలన్నారు. జనవరి మొదటి వారంలో మళ్లీ జిల్లాలో పర్యటించడం జరుగుతుందని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు పేర్కొన్న అంశాలకు సంబంధించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసి తమీమ్ అన్సారీయా, డిఆర్‌ఓ సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట, మదనపల్లె ఆర్డీవోలు రంగస్వామి, కోదండరామిరెడ్డి, మురళి, తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.










