రాయచోటిటౌన్ : ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్ పేర్కొన్నారు. ఈ నెల 3న ధర్మస్థలి వేదక వద్ద సంకల్ప దీక్షను పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా ఆదివారం రాయచోటి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులు సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు చేయాలని గతంలో పలుమార్లు అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే వారంలోపే సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి, గద్దెనెక్కాక విస్మరిం చారనని విమర్శించారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా సిపిఎస్ కొనసాగుతూనే ఉందని చెప్పారు. సిపిఎస్ పట్ల ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం వల్లే రద్దు పై హామీ ఇర్చారని సలహాదారులు, ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు ఇవ్వడం దారుణమన్నారు. సిఎం ఇచ్చిన హామీని నెరవే ర్చాలని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందేనని, ప్రత్యామ్నాయంగా ప్రవేశపెడతామంటున్న జిపిఎస్‌ను ఒప్పుకొనే ప్రశ్నేలేదని పేర్కొన్నారు. పాత పింఛన్‌ను అమలుచేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని తెగేసి చెప్పారు. జిపిఎస్ పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను మరోసారి వంచించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. జిపిఎస్ వల్ల ఉద్యగులకు ఒరిగేదేమీ లేదని వాపోయారు. పైగా నష్టదాయకమని చెప్పారు. మరో వైపు దేశంలో సిపిఎస్‌ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వమని, ఖజానా ఖాళీ అవుతుందని కేంద్ర ప్రభుత్వం బెదిరించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అంతక మునుపు ఫ్యాప్టో అన్నమయ్య జిల్లా సెక్రటరీ జనరల్ రవి శంకర్ యుటిఎఫ్ నాయకులకు పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్షకు సంఘీభావంగా వారు మాట్లాడుతూ పాలకులు ఉద్యోగ వ్యతిరేక విధానాలతో రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాయడాన్ని ఉద్యమాలతో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్బంధాలకు భయపడే ప్రశ్నే లేదని, ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సిపిఎస్ కన్వీనర్ రమణమూర్తి జిల్లా గౌరవాధ్యక్షుడు సుధాకర్ నాయుడు, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పురం వెంకట రమణ, వివిధ మండలాల నాయకులు నాగేంద్ర, కిఫాయత్, రెడ్డి ముని సుధాకర్, శ్యామ్ సుందర్, ఇర్ఫాన్, రెడ్డి బసయ్య, మునిరత్నం నాయుడు, బావా జాన్, రమణ, శంకరయ్య, రఫీక్ ఖాన్, సుబహాన్, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










