నేడు అంకురార్పణ, రేపు ధ్వజారోహణం
5న సీతారాముల కల్యాణం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టకు బ్రహ్మోత్సవ శోభ వచ్చింది. నేటి నుంచి మొదలయ్యే కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, పనులు పూర్తయ్యాయి. ఆలయప్రాంగణం, ఆలయాన్ని దీపాలతో అలంకరించారు. శ్రీరామనవమిపై ప్రచారం కల్పించేందుకు భారీ ప్లెక్సీలు, గోడపత్రాలు అంటించారు. హరిత శోభకోసం ప్రత్యేకంగా మొక్కలను తెప్పించారు. కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీన జరుగనున్న సీతారాముల కల్యాణ ఘట్టానికి యుద్ధప్రాతిపదికన కల్యాణ వేదికను ముస్తాబు చేస్తున్నారు. కోదండరామస్వామి వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు గురువారం ఘనంగా అంకురార్పణ నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి తొమ్మిది రోజులపాటు బ్రహోత్సవాల నిర్వహణకు టిటిడి యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 4 నుంచి 6 గంటల వరకు వ్యాసాభిషేకం (మూలవర్లకు అభిషేకం), 7.30 నుంచి 11 గంటల వరకుమ సర్వదర్శనం, 10 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం ఉంటుంది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
రేపు ధ్వజారోహణం: ఈ నెల 31న ఉదయం 9 గంటలకు వృషభలగంలో ధ్వజారోహణం ఉంటుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిస్తారు.
5న శ్రీ సీతారాముల కల్యాణం : ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 8 నుంచి 10 గంటల వరకు సీతారాముల కల్యాణం వేడుకగా నిర్వహిస్తారు. ప్రజలు రూ.750 చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
నేడు, రేపు కవి సమ్మేళనం : శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో మార్చి 30వ తేదీ పోతన భాగవతం అంశంపై కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. 31వ తేదీ శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో 30వ తేదీ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జియస్‌ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన 'పోతన భాగవతం'పై ప్రముఖ పండితులు ఎం.నారాయణరెడ్డి, రుక్మిణి సందేశం డాక్టర్ బి.గోపాలకృష్ణ శాస్త్రి, శ్రీరామ జననం, డాక్టర్ కె.సుమన, సీతారామ కళ్యాణం పి.శంకర్, భక్తి రసం వి.చిన్నయ్య, కుచేలోపాఖ్యానం ఎం.లోకనాధం, శరణాగతి తత్వం అంశాలపై కవి సమ్మేళనం ఉంటుంది. 31వ తేదీ టిటిడి అర్చక శిక్షణ కో-ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్ అధ్యక్షతన 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకం'పై ఎల్.జగన్నాథ శాస్త్రి, గడియారం వెంకట శేషశాస్త్రి రామాయణం, ఎం.మల్లికార్జునరెడ్డి శ్రీ రామాయణ కల్పవృక్షం, వై.మధుసూదన్, శ్రీ రంగనాథ రామాయణం, డాక్టర్ సి.శివా రెడ్డి, శ్రీమద్ వాల్మీకి రామాయణం, యు.భరత్ శర్మ, చంపూ రామాయణం, డాక్టర్ పి.నీలవేణి మొల్ల రామాయణం అంశాలపై కవి సమ్మేళనం నిర్వహిస్తారు. శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా మార్చి 31 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.










