Mar 10,2022 22:16
  • అతికష్టం మీద గట్టెక్కిన సిఎం ప్రమోద్‌ సావంత్‌
  • కాంగ్రెస్‌ను ఓడించినా ఖాతా తెరవని టిఎంసి
  • ఖాతా తెరిచిన ఆప్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గోవాలో ఏ పార్టీకీ, కూటమికీ పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. మొత్తం 40 స్థానాల్లో బిజెపి 20 స్థానాలను సాధించి, అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌ 11 స్థానాలు , కాంగ్రెస్‌ కూటమిలోని గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జిఎఫ్‌పి) ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీతో కూటమి కట్టిన మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ (ఎంజిపి) 2 స్థానాలను గెలుచుకుంది. ఆప్‌ రెండు స్థానాలను, రివల్యూషనరీ గోన్స్‌ పార్టీ (ఎంజిపి) 1, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. ఎంజిపి, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి యత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల కంటే ఇప్పుడు బిజెపి ఏడు స్థానాలు ఎక్కువ గెలుచుకోగా, కాంగ్రెస్‌ ఆరు స్థానాలను కోల్పోయింది. జిఎఫ్‌జి రెండు, ఎంజిపి ఒక స్థానాన్ని కోల్పోయాయి.

  • అతికష్టం మీద గట్టెక్కిన సిఎం ప్రమోద్‌ సావంత్‌

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ అతికష్టం మీద గట్టెక్కారు. సాంక్వెలిమ్‌ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీ చేసిన ప్రమోద్‌ సావంత్‌ తొలి రౌండ్‌ నుంచి వెనుకంజలో ఉన్నారు. కేవలం 666 ఓట్లతో గెలుపొందారు. ప్రమోద్‌ సావంత్‌కి 11,795 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ధర్మేష్‌ సాగాలనికి 11,414 ఓట్లు వచ్చాయి.

  • ఖాతా తెరిచిన ఆప్‌

గోవాలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) తొలిసారి ఖాతా తెరిచింది. బెనౌలిమ్‌ నియోజకవర్గం నుంచి ఆప్‌ అభ్యర్థి కెప్టెన్‌ వెంజీ విగాస్‌, తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి చర్చిల్‌ అలెమావోపై 1,271 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వెలిమ్‌ నియోజకవర్గం నుంచి ఆప్‌ అభ్యర్థి క్రజ్‌ సిల్వా, తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి డిసిల్వా సావియోపై కేవలం 169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • కాంగ్రెస్‌ను ఓడించిన టిఎంసి

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి టిఎంసి ప్రధాన కారణంగా కనబడుతుంది. గోవా ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టిఎంసి ఓట్లు భారీగా చీల్చింది. ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఆరు స్థానాల్లో బిజెపి అభ్యర్థులు 500, 1000 ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. గోవా కాంగ్రెస్‌లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఈసారి ఎనిుకల్లో టిఎంసి బాగానే ప్రభావం చూపుతుందేమో అనుంత హడావుడి జరిగింది. స్వయంగా మమతా బెనర్జీయే రెండు సార్లు గోవాకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక పార్టీకి చెందిన బెంగాల్‌ నేతలు గోవాలోనే మకాం వేశారు. వచ్చే లోక్‌సభ ఎనిుకల నాటికి జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్న మమతా బెనర్జీకి గోవా ఫలితం నిరాశనే మిగిల్చింది.

  • మొత్తం స్థానాల్ణు 40

మ్యాజిక్‌ ఫిగర్ణ్‌ - 21
బిజెపి - 20
కాంగ్రెస్‌ - 11
జిఎఫ్‌పి - 1
ఎంజిపి - 2
ఆప్‌ - 2
ఆర్‌జిపి - 1
స్వతంత్రులు - 3

2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి..
కాంగ్రెస్‌ - 17
బిజెపికి - 13
ఎన్‌సిపికి - 1
ఎంజిపికి - 3
జిఎఫ్‌పి - 3
స్వతంత్రులు - 3