Feb 06,2023 20:03

వార్డులో పర్యటించిన టిడిపి నాయకులు

ప్రజాశక్తి - రాయచోటి : వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క ఛాన్స్‌ ఇచ్చినందుకు ప్రజలు తమకు 'ఇదేమి ఖర్మ' అని అనుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్ర అభివద్ధి కుంటుపడిందని రాయచోటి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎంఎల్‌ఎ ఆర్‌. రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలో 14వ వార్డులో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన మన రాష్ట్రానికి ఇదేమి ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పట్టణంలోని వీధులలో తిరుగుతూ వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ ఇచ్చినందుకు జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్నారు. మూడున్నర ఏళ్లుగా ఏం ఘనకార్యం చేశారని గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. గడప గడపకూ కార్యక్రమంలో నాయకులను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తాము ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తుంటే 2019 ఎన్నికల్లో తెలియక జగన్‌ పార్టీకి ఓట్లు వేశామని ఇప్పుడు ఇదేం కర్మ అని బాధపడుతున్నామని ప్రజలు అంటున్నారని తెలిపారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకురాక పోగా టిడిపిలో తీసుకొచ్చిన పరిశ్రమలను తుగ్లక్‌ నిర్ణయాలతో వెళ్ళగొడుతున్నారని ఆరోపించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాష, పట్టణ అధ్యక్షులు బోనమల ఖాదర్‌వలి, రూరల్‌ అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, పట్టణ మైనార్టీ అధ్యక్షులు అతావుల్లా, టిడిపి నాయకులు, మన్సూర్‌, సోనిరాజ్‌ కలిమ్‌, పట్టణ ఉపాధ్యక్షులు రెహ్మాన్‌, మహబూబ్‌ అలీఖాన్‌, అత్తర్‌ జావిద్‌, శ్రీనివాసులు, శేషిజాబీర్‌, సయ్యద్‌, మాజీ కౌన్సలర్‌ మహబూబ్‌బాష, రాజంపేట సెల్‌ అధ్యక్షులు అమావాస్య రెడ్డయ్య, బసయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.