Aug 07,2021 06:27

     బిసి లను గుర్తించేందుకు రాష్ట్రపతికి అంటే కేంద్ర ప్రభుత్వానికి గల ఏకైక అధికారంగా 102వ రాజ్యాంగ సవరణకు భాష్యం చెప్పింది. ఈ సవరణ వల్ల రాష్ట్రాలు తమ అధికారాన్ని కోల్పోయాయని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. రాష్ట్రపతికి లేదా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ అధ్యక్షుడికి సలహాలు, సూచనలు మాత్రమే రాష్ట్రాలు ఇవ్వగలవు. తమ రాష్ట్రాల్లో ఎవరు ఒబిసి లో నిర్ణయించేందుకు రాష్ట్రాలకు గల హక్కుపై ఇది తీవ్రంగా దాడి చేయడమే కాగలదు. రాష్ట్రాల హక్కులను హరించడం ఈ రాజ్యాంగ సవరణ ఉద్దేశ్యం కాదని మోడీ ప్రభుత్వం చెబుతూ వచ్చినప్పటికీ, జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
     ప్రస్తుత విద్యా సంవత్సరంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌, డెంటల్‌ కోర్సులకు అఖిల భారత కోటాలో ఇతర వెనుకబడిన వర్గాలకు (ఒబిసి) 27 శాతం రిజర్వేషన్లు, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటనను బిజెపి, దాని మద్దతుదారులు ప్రశంసించారు. ఒబిసి ల సంక్షేమం పట్ల మోడీ ప్రభుత్వ నిబద్ధతకు ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చారిత్రకమైనదిగా ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయంలో ప్రభుత్వ రికార్డు వేరే రకంగా వుంది. వాస్తవానికి, 2020 జులైలో తామిచ్చిన తీర్పుపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనందున కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని మద్రాసు హైకోర్టు హెచ్చరించింది. దాంతో ప్రభుత్వం పై చర్య తీసుకోవాల్సి వచ్చింది.
     వాస్తవాలు కింది విధంగా వున్నాయి : 2016లో అన్ని వైద్య కళాశాల్లో ప్రవేశానికి ఒకే ప్రవేశ పరీక్ష (నీట్‌) వుండాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నీట్‌ ద్వారా నిర్వహించిన అడ్మిషన్లలో 15 శాతం అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లను, 50 శాతం పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్లను రాష్ట్రాలు అఖిల భారత కోటాకు ఇచ్చేయాల్సి వుంది. ఈ సీట్లను కేంద్ర జాబితా ద్వారా భర్తీ చేస్తారు. అంతకు ముందు, అంటే 2007లో, అఖిల భారత కోటా కింద 15 శాతం సీట్లు ఎస్‌సి లకు, 7.5 శాతం సీట్లు ఎస్‌టి లకు రిజర్వ్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, అఖిల భారత కోటాలో ఒబిసి ల రిజర్వేషన్‌కు ఎలాంటి నిబంధనలు లేవు. 2007లో యుపిఎ ప్రభుత్వ హయాంలో కేంద్ర విద్యా సంస్థల్లో 27 శాతం ఒబిసి రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకు వచ్చినప్పటికీ పరిస్థితి ఇలానే వుంది. అందువల్ల కేంద్ర పరిధి కిందకు వచ్చిన అఖిల భారత కోటాలో ఒబిసి లకు రిజర్వేషన్‌ లేకపోవడం వివక్షతో కూడినది. అయితే, నీట్‌ను ప్రవేశపెట్టిన దగ్గర నుండి, వైద్య, దంత కళాశాల్లో సీట్లకు అఖిల భారత కోటాలో ఒబిసి లకు రిజర్వేషన్‌ కల్పించేందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
     దీంతో, అఖిల భారత కోటాకు తమిళనాడు ఇచ్చిన సీట్లలో ఒబిసి ల కోసం 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలంటూ తమిళనాడుకు చెందిన డిఎంకె, సిపిఎం సహా ఇతర ప్రధాన రాజకీయ పక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ విషయాన్ని విచారించేందుకు సుప్రీం నిరాకరించింది. దీన్ని హైకోర్టు విచారించాలని పేర్కొంది. దీంతో ఈ పార్టీలన్నీ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. 2020 జులైలో హైకోర్టు, ఒబిసి లకు రిజర్వేషన్‌ చట్టబద్ధతను సమర్ధించింది. ఈ విద్యా సంవత్సరం నుండి ఈ కోటాకు అనుసరించాల్సిన విధి విధానాలను నిర్ణయించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, ఈ ఏడాది పథకంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఒబిసి లకు రిజర్వేషన్‌ను కల్పించలేదు. దాంతో దీనిపై డిఎంకె మద్రాసు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. 2021 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో అఖిల భారత కోటాకు సంబంధించి ఒబిసి రిజర్వేషన్‌ కోటాను అమలు చేయకూడదని కేంద్రం ప్రయత్నిస్తే అది, 2020 జులై 27న తామిచ్చిన కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లుగా భావించాల్సి వస్తుందని జులై 19న హైకోర్టు వ్యాఖ్యానించింది. మద్రాసు హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం కోర్టు ధిక్కార ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్రం అఖిల భారత కోటాలో ఒబిసి రిజర్వేషన్‌ను ప్రకటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
     ఒబిసి రిజర్వేషన్‌ అంశంపై మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యపూరితమైన, పక్షపాత ధోరణి మరో విషయంలో కూడా బయటపడింది. 2018 ఆగస్టులో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ఆమోదించింది. ఒక వర్గాన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా (ఎస్‌ఇబిసి) ప్రకటించేందుకు రాష్ట్రపతికి అధికారమిచ్చే క్లాజులను ఇది ప్రవేశ పెట్టింది. ఆ సమయంలో, పార్లమెంట్‌లో, ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడుతూ, దీనివల్ల ఒబిసి లను గుర్తించేందుకు రాష్ట్రాలకు గల హక్కు తీవ్రంగా ప్రభావితం అవుతుందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఆ అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చింది. అప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ ద్వారా కేంద్ర జాబితాకు ఒబిసి లను గుర్తిస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ ద్వారా రాష్ట్ర జాబితాకు ఒబిసి లను గుర్తిస్తూ వచ్చాయి.
     ఈ సవరణకు సంబంధించిన కేసును ఈ ఏడాది మే నెలలో సుప్రీం కోర్టు విచారించింది. ఒబిసి లను గుర్తించేందుకు రాష్ట్రపతికి అంటే కేంద్ర ప్రభుత్వానికి గల ఏకైక అధికారంగా 102వ రాజ్యాంగ సవరణకు భాష్యం చెప్పింది. ఈ సవరణ వల్ల రాష్ట్రాలు తమ అధికారాన్ని కోల్పోయాయని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. రాష్ట్రపతికి లేదా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ అధ్యక్షుడికి సలహాలు, సూచనలు మాత్రమే రాష్ట్రాలు ఇవ్వగలవు. తమ రాష్ట్రాల్లో ఎవరు ఒబిసి లో నిర్ణయించేందుకు రాష్ట్రాలకు గల హక్కుపై ఇది తీవ్రంగా దాడి చేయడమే కాగలదు. రాష్ట్రాల హక్కులను హరించడం ఈ రాజ్యాంగ సవరణ ఉద్దేశ్యం కాదని మోడీ ప్రభుత్వం చెబుతూ వచ్చినప్పటికీ, జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి మరోసారి రాజ్యాంగాన్ని సవరించాల్సి వుంది. అలా చేయడానికి బదులుగా, మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసింది. దాన్ని కోర్టు తిరస్కరించింది. ప్రస్తుత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఒబిసి లను గుర్తించడంపై రాష్ట్రాలకు గల హక్కులను పునరుద్ధరించేందుకు మోడీ సర్కార్‌ నేరుగా రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సి వుంది. అయితే, సమయాన్ని వృధా చేసిన తర్వాత, ఇప్పుడు సమావేశాల మధ్యలో రాజ్యాంగ సవరణ ప్రవేశ పెట్టడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్య ఫలితంగా రాష్ట్రాల కీలక హక్కు తిరస్కరించబడినందున ఇప్పుడు దాన్ని దిద్దుకోవాల్సిన అవసరముంది.
 

/ 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం /