May 01,2022 17:33

న్యూఢిల్లీ : మస్లింలను లక్ష్యంగా చేసుకుని జహంగీర్‌పూరీ ప్రాంతంలో కూల్చివేతలకు పాల్పడ్డారని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. హనుమాన్‌ జయంతి ఊరేగింపు సందర్భంగా చెలరేగిన రాళ్ల దాడి, హింసాత్మక ఘటనల్లో నిందితులుగా పేర్కొంటూ కొంత మంది నివాసాలనూ, వాణిజ్య సముదాయాల కూల్చివేతకు పాల్పడ్డారు. ఈ ఘటనను ఆపేందుకు బుల్డోజర్‌కు ఎదురుగా బృందాకరత్‌ నిలబడిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి... స్టే విధించింది. కాగా, ఈ ఘటనపై బృందాకరత్‌తో హిందూస్థాన్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది.

ఓ మతాన్నే లక్ష్యంగా కూల్చివేతల ప్రక్రియ
యుపి, మధ్యప్రదేశ్‌లో మతపరమైన పక్షపాత ధోరణి ఉందని ఆమె అన్నారు. ' మొదటి విషయం ఏంటంటే ఇదొక ఎంపిక (సెలక్టివ్‌). రెండో అంశం ఏంటంటే.. ఈ ఎంపిక చట్టం దృష్టిలో చట్టపరమైన, చట్టవిరుద్ధమైన వాటిపై ఆధారపడి ఉండదు. మీరు ఏ మతాన్ని విశ్వసిస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇస్లాం మతాన్ని నమ్మితే లేదా..ఓ ముస్లింని అయితే.. ఇతర మతస్థుల కన్నా.. నా ఇంటికి ఎటువంటి నోటీసు లేకుండా కూల్చివేసే అవకాశం ఉంది' అని వ్యాఖ్యానించారు.
ఈ కూల్చివేతలను సెలెక్టివ్‌గా పేర్కొన్న బృందాకరత్‌.. దీనికి కారకులైన ఢిల్లీ బిజెపి చీఫ్‌ ఆదేశ్‌ గుప్తాపై మండిపడ్డారు. కూల్చివేయబోయే ఇళ్లు , అల్లర్లకు పాల్పడే అక్రమదారులవని, అవి ఆక్రమించుకున్నవని ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఆయన లేఖ రాశారని తెలిపారు. దీంతో ఇవి చట్టవిరుద్ధంగా నిర్మించినవని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చి, వెంటనే బుల్డోజర్లను ఆదేశిస్తారని, కేంద్ర ప్రభుత్వం బలగాలను అందిస్తుందని దుయ్యబట్టారు. ' నేను అల్లర్లకు ప్పాలడితే.. అది రుజువు చేసి శిక్ష వేసేందుకు కోర్టు లేదా..? నా ఇంటికి బుల్డోజర్‌ పంపి నా జీవనోపాధిని, నా జీవితాన్ని నాశనం చేసే హక్కు అధికారంలో ఉన్న పార్టీకి ఇచ్చారా...?' అని ఘాటుగా ప్రశ్నించారు.
ఆయుధాలతో అక్రమ ఊరేగింపులకు అనుమతేంటీ..?
ఏప్రిల్‌ 16న వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పూరీ ప్రాంతంలో హనుమాన్‌ జయంతి వేడుకల్లో ఈ ఘర్షణలు చెలరేగాయని బృందాకారత్‌ అన్నారు. పోలీసులు అనుమతించిన శాంతియుత ఊరేగింపు ముగిసిన తర్వాత.. కత్తులు, పిస్టల్స్‌తో అక్రమంగా ఊరేగింపు చేపడుతూ.. మసీదుల దగ్గర ఓ గుంపు హల్‌చల్‌ చేసిందని, మసీదు వద్దే ఊరేగింపు ఆపారని, దీనికి ఎవరు అనుమతిచ్చారని ప్రశ్నించారు. పదునైన కత్తులు, ఫిస్టల్స్‌తో ప్రధాని రహదారి గుండా కాకుండా.. వారు ఊరేగింపు చేయని సిబ్లాక్‌లోని గల్లీల గుండా వెళ్లారని అన్నారు. ముస్లింలు రోజా నిర్వహించే సమయంలోనే.. మసీదుల దగ్గర ఈ గుంపు గుమిగూడటం వెనుక అర్థమేమిటన్నారు.
ఊరేగింపు ఆపితే మరింత రెచ్చిపోయేవారు : పోలీసుల సమాధానం
ఈ సాయుధ ఊరేగింపు గురించి ఢిల్లీ పోలీసు సీనియర్‌ అధికారితో మాట్లాడానని, వారు ఊహించని విధంగా సమాధానమిచ్చారని ఆమె అన్నారు. తాము ఆ చర్యలను ఆపడానికి ప్రయత్నించినట్లయితే.. ఇంకా ఉద్రికత్త ఏర్పడి... హింసాత్మక ఘటనలు జరిగేవని ప్రత్యేక కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సిపి) చెప్పుకొచ్చారని తెలిపారు. వాస్తవంగా చెప్పాలంటే.. మసీదు దగ్గర ఊరేగింపు ఆపేందుకు వీరికి అనుమతి లభించిందని, రెచ్చగొట్టే విధంగా గుంపు ఇచ్చిన నినాదాలకు సంబంధించిన వీడియో తమ వద్ద ఉన్నాయన్నారు. వారు ఉద్ధేశపూర్వకంగా మసీదు వద్ద ఆగిపోయారని పేర్కొన్నారు. అయితే రాళ్ల దాడి చేసిన వారిని శిక్షించండని... బిజెపి స్లోగన్‌నే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వల్లె వేస్తున్నారని అన్నారు. మరి చేతుల్లో ఆయుధాలు పట్టుకుని మసీదు ముందు ఆగిన వారికి శిక్ష ఏమిటని కేజ్రీవాల్‌పై మండిపడ్డారు.
ఆక్రమణ తొలగింపు చట్ట ప్రకారం జరగాలి
ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పా అని ప్రశ్నించగా.. చట్టం ప్రకారం ఆక్రమణలు తొలగించాలని ఆమె అన్నారు. 'ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ప్రకారం.. ఇది ఆక్రమణగా పరిగణించబడుతుంది. కొన్ని సందర్భాల్లో జరిమానా చెల్లించి క్రమబద్ధీకరిస్తారు. కొన్ని సందర్భాల్లో వారికి నోటీసులిస్తారు. చట్ట ప్రకారం సంతృప్తికరమైన సమాధానం రాకపోతే కూల్చివేసే హక్కు కార్పొరేషన్‌కు ఉంటుంది. నమోధిత వీధి వ్యాపారులకు కూడా నోటీసులు ఇవ్వాలి' అని బృందాకరత్‌ పేర్కొన్నారు.