సినిమాల్లోని పాత్రల కోసం.. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేందుకు అవసరాన్ని బట్టి ఈ మధ్య కాలంలో నటీనటులు తమ శరీరంలో మార్పులు చేసుకుంటున్నారు. ఇది కొత్తేమీ కాకపోయినప్పటికీ కొందరు అభిమానులు ఈ మార్పులపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం సర్వ సాధారణమైపోయింది. తాజాగా 'దస్వీ' చిత్రంలో నటించిన నిమ్రిత్ కౌర్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య తెలుగులో వచ్చిన 'సైజ్ జీరో' చిత్రానికి అనుష్కా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. బాడీ షేమింగ్‌పై ట్రోల్ చేయడం సరైన పద్ధతి కాదని, అవి తమని ఎంతగానో బాధిస్తాయని అనేకమంది నటులు చెప్తూనే ఉన్నారు. ప్రస్తుతం నటి నిమ్రిత్ కౌర్ కూడా ట్రోలర్స్‌కి మంచి కౌంటరే ఇచ్చారు.. ఈ నేపథ్యంలో ఆమె గురించిన మరిన్ని విశేషాలు..!
'యాహాన్' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి, 'ది లంచ్ బాక్స్'తో గుర్తింపు తెచ్చుకున్న నిమ్రత్‌కౌర్ రాజస్థాన్‌లో ఓ సిక్కు కుటుంబంలో జన్మించారు. తండ్రి ఆర్మీ ఆఫీసర్. పాతికేళ్ల క్రితం ఆయన కశ్మీరీ ఉగ్రవాదుల చేతుల్లో మరణించారు. ఆ తరువాత నిమ్రత్ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చారు. అక్కడే విద్యనభ్యసిస్తూ.. మోడల్‌గా కొన్నాళ్లు పనిచేసిన ఈమె 2005 నుంచీ సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. చేసింది తక్కువ సినిమాలే అయినా నటనలో మంచి పేరే సంపాదించుకున్నారు. పలు సినిమాలు, వెబ్ సీరీస్‌లు, టీవీ సీరియళ్లలోనూ నటించారు.
నాసిరకం జోకులు ఆపండి..
కాగా దస్వీ చిత్రం కోసం తాను బరువు పెరిగానని, ఈ నేపథ్యంలో తన వయసు, శరీరంపై కొందరు నాసిరకం జోకులు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 'దస్వీ' చిత్రంలో ముఖ్యమంత్రిగా కనిపించిన ఆమె.. ట్రోలింగ్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. దీనిపై తాజా సమావేశంలో ఆమె ఇలా స్పందించారు. 'సినిమా కోసం 15 కిలోల బరువు పెరిగి, మళ్లీ తగ్గడం సవాల్‌గా మారింది. ఈ క్రమంలో బరువు, వయసుపై కొందరు చేసున్న నెగెటివ్ కామెంట్లు బాధించాయి. అలాగే ఈ మధ్య 40 దాటిన నటులు ప్రయోగాలు చేయడంపై కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ''అలాంటి వాళ్లది అత్యంత కాలంచెల్లిన నాసిరకం పద్ధతి'' అంటూ సెటైర్ వేశారు. ఇక జీవితంలో జరిగే ఏ ప్రక్రియ అయినా నెమ్మదిగా జరుగుతుందని, దానికి ఓపిక పట్టడమే ప్రధానమని నేర్చుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎవరేం అనుకున్నా తన శరీరంపై విపరీతమైన గౌరవాన్ని పెంచుకున్నానన్న నిమ్రత్.. ఏదైనా శ్రద్ధగా వింటూ పూర్తిగా అర్థంచేసుకుని అవసరమైనదే తీసుకోవాలని సూచించారు.
ఏం జరుగుతుందో అర్థం కాలేదు..
తన కెరీర్ గురించి వస్తున్న రూమర్స్‌పై స్పందించిన నిమ్రిత్ కొంతకాలంగా మానసిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో డాక్టర్ల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇదే అదనుగా కొంతమంది సృష్టించిన పుకార్లతో అభిమానులు ఆందోళన చెందినట్లు తన దృష్టికి వచ్చిందన్న నటి.. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎవరూ గందరగోళానికి గురికావొద్దని కోరారు. 'కొద్ది రోజులు నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వైద్యులను సంప్రదించడంతో ''బ్రెయిన్ బర్న్ అవుట్'' అని నిర్ధారణ అయింది. ఈ క్లిష్ట సమయంలో విశ్రాంతి తీసుకోవడం తప్ప, మరో ఆప్షన్ లేదన్నారు. మీరు అనుకుంటున్నట్లు నేను శ్రమకు దూరంగా ఉండే వ్యక్తిని కాదు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి కష్టపడి పనిచేసే గుణం నా డీఎన్‌ఏలో ఉంది' అంటూ చెప్పుకొచ్చారు. చివరగా తనతో కనెక్ట్ అయ్యే అభిమానులు నిజాయితీగా ఉండాలని.. దారిలో కొండలు, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయనే విషయం తెలుసుకోవాలంటూ ముగించారు.
తగిన స్థానాన్ని పొందలేకపోతున్నారు..
'ది లంచ్ బాక్స్' ఫేమ్ నిమ్రత్ కౌర్ స్త్రీల బలం, హక్కుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా వస్తున్న 'దస్వీ' సినిమాలో రాజకీయ నాయకురాలు 'గంగారామ్ చౌదరి' పాత్రలో కనిపించనున్న ఆమె.. మూవీ ప్రమోషన్‌లో భాగంగా పలు విషయాలపై మాట్లాడింది. 'ఈ చిత్రం విద్య ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. దీంతోపాటు మహిళా సాధికారత, సమాజంలో సమాన హోదా గురించి కూడా ఆలోచింప జేస్తుంది. పెద్దగా చదువుకోని, ఇంటికే పరిమితమైన ఓ స్త్రీ 'ముఖ్యమంత్రి'గా రాష్ట్రంలో తన సత్తా చాటుతోంది. కానీ, ఒక రాష్ట్రాన్ని శాసించే అధికారంలో ఉన్న ఆమె.. తన భర్త ముందు ఎందుకు మాట్లాడలేక పోతుంది? కుటుంబానికి సంబంధించి సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతుంది? అనేది పెద్ద సమస్యగా మారింది' అంటూ ప్రశ్నించింది. అలాగే సమాజంలో మహిళలు తమకు తగిన స్థానాన్ని పొందలేకపోతున్నా రన్న ఆమె.. 'మన సమాజంలో ఓ స్త్రీ తనను తాను నిరూపించుకోవడానికి జీవితాంతం కష్టపడాల్సి వస్తుంద'ని ''దస్వీ'' ప్రయోషన్‌లో భాగంగా చెప్పారు.
పేరు : నిమ్రిత్ కౌర్
ఇతర పేర్లు : నిమ్స్
పుట్టిన తేదీ : మార్చి 13, 1982
పుట్టిన ప్రాంతం : పిలాని, రాజస్థాన్
నివాస ప్రాంతం : ఢిల్లీ
చదువు : గ్రాడ్యుయేషన్
తల్లిదండ్రులు : భూపేందర్ సింగ్, అవినాష్ కౌర్
తోబుట్టువులు : రుబీనా సింగ్, అర్పిత్ సింగ్ అహ్లూవాలియా