Jul 11,2021 11:20

కడప : న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న కేసుకు సంబంధించి కడపకు చెందిన వ్యక్తిని సిబిఐ అరెస్టు చేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై, వారిచ్చిన తీర్పులపై దురుద్దేశాలు, కులాలు, అవినీతి ఆరోపణలను ఆపాదిస్తూ.. వారి ప్రాణాలకు హాని కలిగిస్తామని బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న అభియోగంపై కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి (40)ని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడప సరోజినీనగర్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి మూడేళ్లుగా కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ఇటీవలే సొంతూరికి తిరిగొచ్చాడు.

ఈ నెల 23 వరకు రిమాండ్‌
దర్యాప్తు అధికారి సంజరుకుమార్‌ సమల్‌ ఆధ్వర్యంలో సిబిఐ అధికారులు రాజశేఖర్‌రెడ్డిని శనివారం గుంటూరులోని నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు (సిబిఐ డిజిగేటెడ్‌ కోర్టు) లో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఎస్‌.అరుణశ్రీ ఈ నెల 23 వరకు రిమాండ్‌ విధించారు. అతడిని మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 12 కి వాయిదా వేశారు. అనంతరం నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

ఏ-15 గా రాజశేఖర్‌ రెడ్డి..
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు... తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా పెడుతూ, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభియోగాలపై అప్పటి హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదులు చేశారు. దీనిపై సిఐడి (సైబర్‌ క్రైమ్‌) విభాగం 16 మంది వ్యక్తులు, గుర్తుతెలియని మరికొందరిపై 12 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. 2020 అక్టోబర్‌ 12 న దర్యాప్తును హైకోర్టు సిబిఐ కి అప్పగించింది. అన్ని ఎఫ్‌ఐఆర్‌లనూ కలిపి.. ఒకే కేసుగా నమోదు చేసింది. దానిలో లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఏ-15 గా ఉన్నాడు. దీనిపై 2020 మే 26 న దాఖలయిన వ్యాజ్యాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసింది. 93 మందికి నోటీసులు ఇచ్చింది.

సిబిఐ రిపోర్టు..
'రాజశేఖర్‌రెడ్డి ఆధార్‌కార్డు, పాస్‌పోర్టుల్లో ఇంటి పేరు, పుట్టిన తేదీ వేర్వేరుగా ఉన్నాయి. పాస్‌పోర్టులో ఆయన పేరు లింగాలరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కి బదులు తేరా రాజశేఖర్‌రెడ్డి అని ఉంది. ఆ పోస్టు తానే పెట్టానని, తాను వాడిన సెల్‌ఫోన్‌ బండేరు కోన వంకలో (నీటి ప్రవాహం) పడిపోయిందని, మరో ఫోన్‌ తన తల్లి దగ్గర ఉందని చెప్పారు. అతని ఫేస్‌బుక్‌ ఖాతా తెరవాలని కోరగా యాక్టివ్‌గా లేదని అబద్ధం చెప్పాడు. ఆ ఖాతా యాక్టివ్‌గానే ఉన్నట్టు నిర్థారణ అయింది. ఆ పోస్టు లింకు తొలగించినట్లుగా తెలిసింది. అతని ఈ-మెయిల్‌ ఐడి ద్వారా లాగిన్‌ అవ్వాలని కోరినా అతను వినియోగించిన ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో సాధ్యం కాలేదు' అని సిబిఐ రిపోర్టులో వివరించింది.

పెద్దలెవరో ఉన్నారు.. కస్టడీకి ఇవ్వండి : సిబిఐ
న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల వెనుక ఉన్న పెద్దలు ఎవరో రాజశేఖర్‌రెడ్డికి తెలుసని బలంగా అనుమానిస్తున్నామని సిబిఐ పేర్కొంది. అందుకు సంబంధించి విచారణ చేపట్టిన సిబిఐ రిమాండ్‌ రిపోర్టును సుప్రీంకు అందజేసింది. రాజశేఖర్‌ రెడ్డికి తెలిసిన ఆ పెద్దలెవరో తెలుసుకునేందుకు, ఆ సెల్‌ఫోన్లు ఎక్కడున్నాయో, ఆ పోస్టుల వెనుక ఉద్దేశమేంటో కనుక్కునేందుకు అతడిని కస్టడీకి ఇవ్వాలని సిబిఐ ధర్మాసనాన్ని కోరింది.

ప్రముఖులు ఉండటంపై ధర్మాసనం అసహనం
న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో పెట్టినవారిలో... ప్రముఖులుండటంపై సుప్రీం ధర్మాసనం అసహనాన్ని వ్యక్తపరిచింది. అనుచిత పోస్టులు పెట్టినవారిలో వైసిపి ఎంపి నందిగం సురేశ్‌, ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌, ఆ పార్టీ నాయకుడు ఆమంచి కఅష్ణమోహన్‌, న్యాయవాదులు, పాత్రికేయులు ఉన్నారు. ఈ తరహా పరిస్థితులు దేశంలో ఎక్కడా చూడలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి హైకోర్టుపైనా, న్యాయమూర్తులపైనా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్టుగా ఉన్నాయని ధర్మాసనం అసహనాన్ని ప్రకటించింది.