Dec 29,2020 07:28

    శిరోముండనం కేసు జరిగి నేటికి 25 ఏళ్లు గడిచాయి. ఈ కేసు భారత రాజకీయ, న్యాయ వ్యవస్థ తీరు తెన్నులను అద్దం పడుతుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయ పాలెం గ్రామం లోని దళిత యువకులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను అప్పటి శాసన సభ్యుడు తోట త్రిమూర్తులు అతని అనుచరులతో కలిసి 29.12.1996న శిరో ముండనం చేయించారు. చల్లపూడి పట్టాభి రామయ్య, కనికెళ్ళ గణపతి, పువ్వుల వెంకట రమణ అనే మరో ముగ్గురు దళిత యువకులను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన యువతిని గురించి గ్రామం లోని నందిబొమ్మ దిమ్మపై రాశారనీ, దీనికి ఈ అయిదుగురే కారణమనేది నిందితుల ఆరోపణ. బాధితుల కథనం ఇందుకు భిన్నంగా ఉంది. 1994 సార్వత్రిక ఎన్నికలలో రామచంద్రపురం నియోజవర్గం నుంచి త్రిమూర్తులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ సందర్భంగా ఈ యువకులు బి.ఎస్‌.పి బూత్‌ ఏజెంట్లుగా పని చేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు అనుచరులు పాల్పడుతున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవటమే అసలు కారణమని చెబుతున్నారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న త్రిమూర్తులు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తమను అనేక వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. దానిలో భాగంగానే ఈ ఆరోపణలు చేసి శిరోముండనం చేయించినట్లు తెలిపారు.
      ఈ సంఘటనపై 4.1.1997న 'వార్త' దిన పత్రికలో కథనం వచ్చింది. దాని ఆధారంగా అప్పటి ఎస్పీ ఆదిత్య త్రిపాఠి బాధితులను కలిసి వివరాలు సేకరించి ద్రాక్షారామ పోలీస్‌ స్టేషన్లో తోట త్రిమూర్తులు, మరో తొమ్మిది మందిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగి పాతికేళ్ళు అయింది. ప్రత్యక్ష సాక్షులు 24 మందిలో తొమ్మిది మంది చనిపోయారు. ఈ కేసులో తోట త్రిమూర్తులును 7.1.1997న అరెస్టు చేశారు. మరుసటి రోజు మిగిలిన నిందితులు కోర్టులో లొంగిపోయారు. ఈ కేసు ప్రక్రియ మొదలైన తర్వాత కేసు నిర్వీర్యం చేయడానికి చేయని ప్రయత్నం లేదు. అప్పటి జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమిషన్‌ సభ్యుడు హనుమంతప్ప బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఫార్సు చేసినా ఇంతవరకు అమలు కాలేదు. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరికి దళితులు విజయం సాధిస్తారా ? అందుకు ఇంకా ఎంత కాలం వేచి చూడాలి అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకవలసి ఉంది.
 

(శిరోముండనం కేసుకు పాతికేళ్లు)
- బి.బి. జోగేష్‌,
న్యాయవాది,
సెల్‌ : 98666 02325