ప్రజాశక్తి-హిందూపురం ఓ యువకుడు తనను నమ్మించి మోసం చేశాడని, న్యాయం చేయాలని ఓ యువతి శనివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సుమారు ఐదు గంటల పాటు ఆందోళన చేసింది. యువతికి కెవిపిఎస్ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ హిందూపురం రూరల్ మండలం కిరికెర గ్రామంలో నివాసం ఉంటున్న తనకు కర్నూల్ జిల్లా పెద్దవడుగురు, లక్ష్మీపేటలో నివాసం ఉంటున్న వెంకన్న కుమారుడు గణేష్‌తో గుత్తిలో పరిచయం ఏర్పందన్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి మూడేళ్లపాటు ఇద్దరం కలిసి మెలసి తిరిగామన్నారు. అయితే ఇప్పుడు వివాహం చేసుకోమని అడిగితే దళిత కుటుంబానికి చెందిన మహిళను కావడంతో పెళ్లికి నిరాకరిస్తున్నాడన్నారు. తనకు న్యాయం చేయాలని రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు న్యాయం చేయకపోవడంతో ఆందోళన చేస్తున్నట్లు వాపోయింది. విషయం తెలిసిన వెంటనే వన్ టౌన్ సిఐ ఇస్మాయిల్ ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. ఇద్దరికీ ఇష్టం ఉండి ముందుకొస్తే అందరి సమక్షంలో చట్ట ప్రకారం వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇందుకు నిరాకరించిన యువతి ఆందోళన కొనసాగించింది. చివరకు ప్రియుడు గణేష్‌తో మాట్లాడి తన తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేస్తామని, వారం రోజులు గడువు ఇవ్వాలని కోరడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో యువతి తల్లితోపాటు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నమయ్య, సెక్రటరీ రమణ, సహాయ కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు విఆర్.రాము, జ్యోతమ్మ, మండల కార్యదర్శి మధు, నరసింహప్ప, మోతుపల్లి అంజనప్ప, నరసింహప్ప, బీచుపల్లి అంజనమ్మ, అంజనప్ప, మహేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడుతున్న సిఐ ఇస్మాయిల్










