Jun 20,2022 23:18

  • శ్రీ ఐదు నియోజక వర్గాలకు 239 క్లీనిక్‌లు మంజూరు
  • శ్రీ రూ.4,182.50 లక్షల నిధులు విడుదల
  • శ్రీ ఇప్పవరకు కేవలం 45 మాత్రమే పూర్తి

ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
ఎన్టీఆర్‌ జిల్లాలో గ్రామీణ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ నిర్మాణాలను పూర్తి చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు గన్నవరం నియోజక వర్గాల పరిధిలో దాదాపు 239 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లకు అవసరమైన భవన నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. జగ్గయ్యపేటకు 56, నందిగామకు 43, మైలవరంకు 59, తిరువూరుకు 63, గన్నవరంకు 18 క్లీనిక్‌లను శాంక్షన్‌ చేశారు. వీటి నిర్మాణానికి ఇది వరకే నిధులు కూడా మంజూరు చేశారు. దాదాపు రూ. 4182.50లక్షల మంజూరు చేశారు. కానీ నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో జాప్యం నెలకొంది. మరో వైపు ఎన్టీఆర్‌ జిల్లాలో సుమారు 239 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లు మంజూరైతే ఇప్పటి వరకు పూర్తి అయినవి కేవలం 45 క్లీనిక్‌లను మాత్రమే పూర్తి చేశారు. జగ్గయ్యపేటలో 8, నందిగామలో 12, మైలవరంలో 19, తిరువూరులో 5, గన్నవరంలో కేవలం ఒకట మాత్రమే పూర్తి చేశారు. మరో 67 క్లీనిక్‌ భవనాలు బేస్‌మెంట్‌ నుంచి స్లాబ్‌ వరకు వివిధ దశలోల ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నియోజక వర్గాల వారీగా చూస్తే జగ్గయ్యపేటలో 23, నందిగామలో 9, మైలవరంలో 9, తిరువూరులో 24, గన్నవరంలో 2 క్లీనిక్‌ల నిర్మాణాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు 127 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌ల పనులు ఇంత వరకు ప్రారంభం కాలేదు. జగ్గయ్యపేటలో 25, నందిగామలో 22, మైలవరంలో 31, తిరువూరులో 34, గన్నవరంలో 15 క్లీనిక్‌ల వర్కులు ఇంత వరకు మొదలు కాలేదు. కొన్నింటికి స్థలం కూడా ఇంత వరకు సేకరించ లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఎప్పటికి వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లను పూర్తి చేస్తారు, ఎన్నటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పేద ప్రజల ఇంటి ముందుకే వైద్య సేవలనే నినాదంతో వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ తెరపైకి తెచ్చారు. వీటిని సొంత భవనాలలో నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి క్లీనిక్‌లోను ఒక మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌లా తీర్చి దిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఇకపై పిహెచ్‌సిలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే చికిత్సలు అందించేలా వీటిని అందుబాటులోకి తేవాలని ఆలోచనలు చేశారు. 24 గంటల పాటు హెల్త్‌ క్లీనిక్స్‌లో ఏఎన్‌ఎం కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయడంతో పాటు సుమారు 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 65 రకాల మందులు, టెలీమెడిసిన్‌ సేవలు అందించాలనే ఉద్దేశంతో వీటి నిర్మాణం చేపట్టారు.