Jun 06,2023 22:30

గ్రామసభలో పాల్గొన్న అధికారులు

ప్రజాశక్తి-చిలమత్తూరు గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారికి భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారంగా రూ. కోటి చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు. కోడూరు తోపు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూమిని కోల్పోతున్న రైతులతో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌ గ్రామ సభను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వైపు నుంచి భూమి ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ ధర మేరకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎకరానికి అత్యధికంగా రూ. 34 లక్షలు వరకు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని చెప్పగా రైతులు సుముఖత చూపలేదు. రూ. కోటి రూపాయాలకు పైన ఇవ్వాలని కోరారు. గతంలో సెజ్‌ల పేరుతో రైతులు భూములు కోల్పోయారు. ఈ తరుణంలో ఉన్న అర కొరా భూమి చేజారితే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. తమ బతుకుకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే ఎకరానికి రూ. కోటి అయితేనే న్యాయం అవుతుందన్నారు. రైతుల అభిప్రాయాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సబ్‌ కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ నాగరాజు, సర్పంచి మురళీ, వీఆర్వో రాజేష్‌, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.