Jan 30,2023 21:42

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న వ్యకాసం నాయకులు

నష్టపరిహారం చెల్లించాలి : వ్య.కా.సం.
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా నష్టపరిహారం చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం తహశీల్దారు కార్యాలయంలో జాతీయ రహదారి 67 నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో అవార్డు ఎంక్వయిరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని బొమ్మవరం, తొలిజాపురం, ఆమన సిరివెళ్ల, వెంగంపల్లి, ఇనగలూరు, లింగంగుంట, దేవరాయపల్లి బిట్‌ వన్‌ గ్రామాలలోని భూముల్లో జాతీయ రహదారి 67 నిర్మాణం కోసం భూములు సేకరించాలని సర్వే చేశారు.
ఆ సర్వే సక్రమంగా జరగలేదు సర్వే అధికారులు నోటీసులో ఇచ్చిన విస్తీర్ణం వేరు వాస్తవంగా భూమి విస్తీర్ణం వేరుగా ఉందన్నారు. కావున మళ్లీ రీ సర్వే చేయించి రైతులు ఎంత విస్తీర్ణం కోల్పోతున్నారో చెప్పాలన్నారు. అలాగే 2013 భూ సేకరణ చట్ట ప్రకారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2013 భూ సేకరణ చట్టంలో బహిరంగ మార్కెట్లో ఉన్న భూమి విలువకు విలువకు మూడంతలు కలిపి ఇవ్వాలని అలాగే పట్టా భూములతో పాటు అసైన్డ్‌ భూములకు కూడా సమానంగా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అలాగే సామాజిక బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ భూముల్లో పనులు కోల్పోతున్న వ్యవసాయ కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని చట్టంలో ఉందని ఆ చట్ట ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. మండలంలోని రైతులందరూ భూసేకరణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మనకు సరైన నష్టపరిహారం వచ్చేంత వరకు భూములు ఇచ్చేందుకు అంగీకరించవద్దని కోరారు. జాతీయ రహదారికి తమ జీవనాధారమైన భూములు తీసుకోవద్దని రైతులు వాపోయారు. నేడు మిగిలిన గ్రామాలు రైతులతో సమావేశం ఉంటుందని తహశీల్దారు తెలిపారు. తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దారు ప్రదీప్‌ కుమార్‌, విఆర్‌ఒ సాయి, గ్రామ రైతులు మాదిరెడ్డి పుల్లారెడ్డి, ఈగ పుల్లారెడ్డి, మంగళ చెన్నయ్య, గండికోట పెంచలయ్య, గువ్వల పెంచల్‌ రెడ్డి, కుంటా పెంచలరావు, మంగళ పెంచల్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.