Nov 22,2022 11:53

వాషింగ్టన్‌   :   నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్‌-1 వ్యోమనౌక విజయవంతంగా చంద్రుని పైకి చేరుకుంది. తాజాగా ఓరియన్‌ క్యాప్సుల్‌ చంద్రుడి ఉపరితలంపై 81 మైళ్ల ఎత్తులో దూసుకెళ్లి పెద్దకక్ష్యలోకి ప్రవేశిస్తోందని బిబిసి పేర్కొంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలి స్పేస్‌ క్యాప్సుల్‌ చంద్రుడి మీదకు వెళ్లింది. ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం.. 12.44 గంటలకు 34 నిమిషాలపాటు ఓరియన్‌ క్యాప్సుల్‌కి భూమితో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడికి అవతలవైపు ఈ ప్రక్రియ జరగడంతో ఈ విధంగా జరిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఆ సమయంలో ఇది గంటకు 5,023 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ.. చంద్రునికి 328 మైళ్ల ఎత్తులో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్టెమిస్‌-1 అనుకున్నదాని కంటే ఎక్కువ విజయం సాధించిందని నాసా వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి తీసిన చిత్రాలను ఒరియన్‌ క్యాప్సుల్‌ పంపిందని, దీనిలో భూమి చిన్న లేత నీలిరంగు చుక్కలా కనిపిస్తోంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న, కలలుగంటున్న రోజుల్లో ఇది ఒకటని నాసా డైరెక్టర్‌ జెబులున్‌ స్కోవిల్లె పేర్కొన్నారు. త్వరలో మానవయాత్ర కోసం సిద్ధం చేస్తున్న వాహనాన్ని తీసుకెళుతున్న క్రమంలో ఈ రోజు ఉదయం చంద్రుడి వెనుక ఉన్న భూమిని చూశామని పేర్కొన్నారు. నాసా కూడా ఒరియన్‌ పంపిన సెల్ఫీలను ఇటీవల షేర్‌ చేసింది.
 ఒక స్పేస్‌ క్యాప్సుల్‌ చంద్రుడి పైకి వెళ్లడం ఇదే మొదటిసారని బిబిసి పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైతే .. 2024లో చంద్రుని చుట్టూ  మానవులను తీసుకువెళ్లే ఆర్టిమిస్‌ 11 ప్రయోగం ప్రారంభమవుతుందని తెలిపింది. సుమారు రెండు నెలల పాటు వాయిదా పడిన ఈ రాకెట్‌ను బుధవారం ఫ్లొరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన సంగతి తెలిసిందే.

nasas-artemis-spacecraft