Apr 28,2023 22:18

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం-సిపిఐ నాయకలు

నరేంద్ర మోడీని గద్దెదింపి.. దేశాన్ని కాపాడుకుందాం..
ప్రజాశక్తి - కావలి : ప్రజావ్యతిరేక, నిరంకుశ, నియంతృత్వ, మతోన్మాద పోకడలతో కేంద్రంలో పరిపాలిస్తున్న నరేంద్రమోడీ బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదింపి, దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం-సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం కావలి ఏరియా ఆసుపత్రి సెంటర్‌ నుండి శ్రీపొట్టిశ్రీరాములు సెంటర్‌ వరకు ఉభయపార్టీల నాయకులు, కార్యకర్తలతో ''వామపక్ష ప్రచారభేరి'' ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, జిల్లా రైతుసంఘం కార్యదర్శి పులిగళ్ళ శ్రీరాములు, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు, రైతుసంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, జిల్లా సిపిఐ సమితి కార్యదర్శి దామా అంకయ్య ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందన్నారు. దానిని కాపాడుకోవడానికి మనం జాతీయోద్యమస్ఫూర్తితో మళ్లీ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. న
రేంద్రమోడీ పెద్దనోట్లు రద్దు చేసి, నల్లధనాన్ని బయటకు తీసి ప్రతిపేదవాడి బ్యాంకు అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తానని ప్రజలకు హామీనిచ్చి, కార్పొరేట్లకు సహకరించి, వారి ఎదుగుదలకు బాగా సహకరించారని విమర్శించారు. 40 కోడ్‌లతో ఉన్న చట్టాలను 4 కోడ్‌లకు కుదించి, నల్లచట్టాలను తెచ్చి, రైతులపై ప్రయోగించారని దుయ్యబట్టారు. ఆసమయంలో రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తే భయపడి నల్లచట్టాలను రద్దు చేసి, రైతులకు క్షమాపణ చెప్పాడన్నారు. దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలకు అంతులేకుండా పోయిందన్నారు. రాజ్యాంగానికి మూలస్తంభాలుగా ఉన్న స్వాతంత్య్రం ప్రజాస్వామ్యం, లౌకికతత్వం సామాజిక న్యాయం విలువలను కాలరాస్తుందని విమర్శించారు. ప్రజావ్యతిరేక, మతతత్వ, నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వాని గద్దెదించేందుకు ప్రజలు ఉద్యమాలకు కలసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య, నాయకులు ఎస్‌.వెంకయ్య, కె.జాన్‌, వై.కృష్ణమోహన్‌, పి.పెంచలనరసింహం, సిపిఐ ఏరియా కార్యదర్శి కె.నాగరాజు, చేవూరు కొండయ్య, సిఐటియు, ఎఐటియుసి, రైతు, వ్యకాసం నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.