ప్రజాశక్తి-మంగళగిరి : నవంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. శనివారం టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోసేసిందని విమర్శించారు. నవంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వ్యక్తిగతంగా కాకుండా, రాజకీయంగా పోరాడదామని చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. వచ్చే వారం నుండి ‘నిజం గెలవాలి’ పేరుతో తన తల్లి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారని తెలిపారు. ఇప్పటికే టీడీపీ-జనసేన జేఏసీ ఏర్పాటు చేశామని, వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన కలిసి పోరాడతాయని అన్నారు. ఐదు రూపాయిల పేటిఎం బ్యాచ్ తో టీడీపీ, జనసేన జాగ్రత్తగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో 175కు 160 స్థానాలు గెలిచి, జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయమని తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీ నేతలు భయపడుతారనుకున్నారని, టీడీపీ నేతలకు ఎలాంటి భయం లేదని పేర్కొన్నారు.










