Feb 16,2023 21:01

నోటిఫికేషన్ షురూ..

ప్రజాశక్తి- కడప ప్రతినిధి
కడప-కర్నూలు-అనంతపురం పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ సహా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కౌంట్‌డౌన్‌ మొదలైంది. గురువారం జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉప సంహరణ, మార్చి 13న పోలింగ్‌, 16న కౌంటింగ్‌ షెడ్యూల్‌ను అమలు చేయాల్సి ఉంది. ఈ నెల 16 నుంచి 23 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఛాంబర్‌లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాగనుంది. మార్చి 18న మహా శివరాత్రి, 19న ఆదివారం మినహా మిగిలిన రోజులన్నీ ఎన్నికల ప్రక్రియ యథాతథంగా సాగనుంది. 24న నామినేషన్ల పరిశీలన, 27న ఉపసంహరణ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చేపట్టే అవకాశం ఉంది. అనంతరం మార్చి 13న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌, 16న కౌంటింగ్‌, 21 తేదీతో ఎన్నికల ఘట్టం ముగి యనుంది.
ఉమ్మడి కడప జిల్లాకు చెందిన 911 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. వీరిలో జడ్‌పిటిసిలు 50 మంది, ఎంపిటిసిలు 547, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు 314 మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఉమ్మడి కడప- కర్నూలు- అనంతపురం జిల్లాలకు చెందిన 27,716 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. కడపలో 7,358, అన్నమయ్య 1,932, అనంతపురం 5,461, సత్యసాయి జిల్లా 3,199, కర్నూలు 5,364, నంద్యాల 4,402 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3,51,700 మంది ఓటర్లు పాల్గొనే అవకాశం ఉంది. కడప జిల్లాలో 82,300, అన్నమయ్యలో 21,00, కర్నూలులో 62,500, నంద్యాలలో 65,500, అనంతపురంలో 69 వేలు, సత్యసాయిలో 51,400 మంది ఓటర్లు పాల్గొనే అవకాశం ఉంది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎంఎల్‌సి స్థానానికి పిడిఎఫ్‌ తరుపున పోతుల నాగరాజు, వైసిపి తరుపున వెన్నపూస రవీంద్రారెడ్డి, టిడిపి తరుపున రామ్‌గోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పిడిఎఫ్‌ తరపున కత్తి నరసింహారెడ్డి, వైసిపి తరుపున రామచంద్రారెడ్డి ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు సాగిస్తుండడం తెలిసిందే. పిడిఎఫ్‌ తరపున పోటీ పడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు యుటిఎఫ్‌ ఇతర ఉపాధ్యాయ, యువజన సంఘాల మద్దతు లభించడం ఊపునిచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసిపికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు ఉన్న సంగతి తెలిసిందే. ఏదే మైనా 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో ప్రీఫైనల్స్‌గా భావించే అవకాశాలు ఉన్నాయ నడంలో సందేహం లేదు.
ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి : జెసి
కడప : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, ప్రచార కార్యకర్తలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జెసి సి.ఎం. సాయికాంత్‌ వర్మ పేర్కొన్నారు. గురువారం ఉదయం కడప స్థానిక సంస్థల నియోజకవర్గపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, ఆరోగ్యకర వాతావరణంలో సాగేందుకు నిబంధనలు సూచనలను ఆయన తెలియజేశారు. ప్రతి మండలంలో ఎంసిసి టీమ్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను నియమించామన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.