ప్రజాశక్తి-కదిరిటౌన్ పట్టణంలోని పట్టణం 20వ వార్డు జడలయ్య మఠంలో 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం నాయకులు బడా సుబ్బిరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 504లో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేశారన్నారు. దీంతో వారు ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అయితే పేదలు మున్సిపల్ స్థలంలో నిర్మించుకున్నారని అధికారులు చెప్పడం ఏంటని నిలదీశారు. 30 ఏళ్ల నుంచి ఇంటి పన్ను, విద్యుత్ బిల్లుల చెల్లింపు, పొజిషన్‌లో ఉంటూ పక్కా గహాలు నిర్మించుకున్నారన్నారు. అలాంటప్పుడు ఇళ్లు కూలుస్తామని నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు జగన్మోహన్, రామ్మోహన్, నాగరాజు, కృష్ణానాయక్, ఫైరోజ్, తిరుపాల్, తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ శ్రీహరిబాబుకి వినతిపత్రం సమర్పిస్తున్నసిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బడా సుబ్బిరెడ్డి, నాయకులు










