Dec 26,2022 22:41

నోటీసు అందజేస్తున్న అధికారి

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలో రూ.23కోట్లు వెచ్చించి నిర్మించిన మున్సిపల్‌ వాణిజ్య భవనం నిరుపయోగంగామారింది. వాణిజ్య భవనాన్ని ప్రారంభించి నాలుగు నెలలు కావాస్తున్న ఇప్పటి వరకు అక్కడ పూర్తి స్థాయిలో వ్యాపారాలు జరగడం లేదు. ఉన్నపళంగా మార్కెట్‌ను తొలగించే సమయంలో పూల వ్యాపారస్తులకు పశువర్దక శాఖకు చెందిన డిప్యూటి డైరెక్టర్‌ కార్యాలయ ఆవరణంలో స్థలాన్ని కేటాయించారు. పూల వ్యాపారులకు నూతన మార్కెట్‌లో ప్రత్యేక గదులను కేటాయించి దీనికి సంబందించి వేలం పాటలను నిర్వహించారు. అయితే పూల వ్యాపారులు అక్కడికి వెళితే అద్దెలు చెల్లించాల్సి వస్తోందని....స్థానిక పశువర్దక శాఖ కార్యాలయంలోనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వెంటనే ఖాళీ చేయించాలని పశువర్దక శాఖ అధికారులను మున్సిపల్‌ అధికారులు పలు మార్లు కోరినప్పటికి వారు స్పందించలేదు. ఈనేపథ్యంలో స్థానిక డిప్యూటి డైరెక్టర్‌ శుభదాస్‌ నాలుగు రోజుల క్రితం అందరికి నోటీసులు ఇచ్చి వెంటనే ఖాళీ చేయాలని కోరారు. అయితే ఇప్పటి వరకు ఎవరు అక్కడి నుంచి ఖాళీ చేయలేదు. కేవలం అధికారుల ఒత్తితో స్థానిక అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి.
శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం
తమ కార్యాలయ ఆవరణంలో పూల వ్యాపారాలు చేస్తున్న వారందరికి వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చాం. అయితే ఇంత వరకు వారు ఖాళీ చేయలేదు. ఇప్పటికే పలు మార్లు పిలిచి ఖాళీ చేయాలని సూచించాం. వారు ఖాళీ చేయక పోతే పోలీసులకు ఫిర్యాదు చేసి, వెంటనే ఖాళీ చేయిస్తాం.
శుభదాస్‌,
డిప్యూటీ డైరక్టర్‌