సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్స్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ అని కూడా చూడకుండా వల్గర్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. హీరోయిన్స్ దృష్టిని ఆకర్షించేందుకు గాను కొందరు చేసే ప్రయత్నాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కనీసం వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా పంచుకోనీయకుండా చేస్తున్నారు. అయితే అలాంటి సమయంలో చాలామంది హీరోయిన్స్ అలాంటి నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోరు. కొందరు మాత్రం తెలివైన సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తనపై కామెంట్ చేసిన నెటిజన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా జవాబిచ్చారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ హీరోయిన్ 'స్వరా భాస్కర్' గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో ఉంటుంటారు. నిజం చెప్పాలంటే స్వరా భాస్కర్ అనేక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఒక్కోసారి సానుకూలంగా స్పందించినా.. అనేకసార్లు ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై స్వరా చేసిన విమర్శలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. స్వరాపై ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్వరా తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
తనకు కరోనా వచ్చినట్టు స్వరా భాస్కర్ ఇటీవల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాం. ఇటీవల నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. దయచేసి అందరూ మాస్క్ ధరించండి. కరోనా సోకకుండా జాగ్రత్తగా ఉండండి' అని స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు. దీంతో ఆమెను అభిమానించే వాళ్లు త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతుంటే.. ద్వేషించే వాళ్లు మాత్రం 'త్వరగా చచ్చిపో!' అంటూ దారుణంగా పోస్ట్‌లు పెడుతున్నారు.
'ప్రముఖులకు కరోనా వస్తే సపోర్ట్‌గా నిలిచే ఫాన్స్, నెటిజన్లను చూశాం.. కానీ స్వరా భాస్కర్‌ను మాత్రం ''త్వరగా చచ్చిపో!'' అనడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడితే ఇలాంటి కామెంట్లు చేస్తారా?' అని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా 'అడ్వాన్స్ రెస్ట్ ఇన్ పీస్' అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. 'త్వరగా చచ్చిపో.. నీలాంటి వాళ్లకి నరకంలో కూడా ప్లేస్ ఉండదు' అంటూ మరికొంతమంది అభ్యంతరకరమైన కామెంట్లను పెడుతూ స్వరాని సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారు.
అయితే తనపై వస్తున్న దారుణమైన కామెంట్లపై స్వరా తనదైన శైలిలో స్పందించారు. 'నేను చనిపోతే.. మీరందరు ఎలా బతుకుతారు? మీ బతుకుతెరువు నన్ను ట్రోల్ చేయడమే కదా? మీ కుటుంబాలను ఎలా పోషిస్తారు? మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. నేను బతకాలని కోరుకోండి' అంటూ స్ట్రాంగ్ సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
గతంలోనూ..
ఆఫ్ఘనిస్తాన్‌ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న వారి అక్రమాల పైన బాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే స్వరా భాస్కర్ తాలిబన్ల దాడులపైన చేసిన ఓ ట్వీట్.. నెటిజన్లను ఆగ్రహనికి గురి చేసింది. తన ట్వీట్‌లో స్వరా 'హిందూత్వ టెర్రరిజం' అనే పదాన్ని వాడారు. దీంతో ఆ సందర్భంగా నెటిజన్లు ఆమె పైన ఫైర్ అయ్యారు.. అవుతున్నారు. 'హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబాన్ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. తాలిబాన్ భీభత్సం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. అయితే అక్కడితోనే ఆగిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం చేయండి. మన మానవతా, నైతిక విలువలు అణచివేత, అణచివేతకు గురైన వారి గుర్తింపుపై ఆధారపడి ఉండకూడదు' అంటూ స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌తో నటి స్వరా భాస్కర్ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆమె ట్విటర్ అకౌంట్‌ని సస్పెండ్ చేసి, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కొందరు హిందూత్వ నెటిజన్లు. ''స్వరా భాస్కర్‌ను అరెస్ట్ చేయండి!'' అనే హాష్‌ట్యాగ్ అప్పట్లో ట్రెండ్ చేశారు. కాగా సోషల్ మీడియాలో నటి ట్రోలింగ్‌కు గురికావడం ఇదే మొదటిసారి కాదు.