- కాన్ఫిడెన్స్ లెవెల్స్‌పై రిజర్వ్‌బ్యాంకు నివేదిక
- మూడో వెల్లువతో మరింత ఉపద్రవం
- సమస్యను గుర్తించినా చేటుచేస్తున్న సంస్కరణలకే మొగ్గు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కొవిడ్ మహమ్మారి ప్రజల ఆర్ధిక స్థితిగతులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి దుర్భర పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సివచ్చింది. దీంతో బతుకుపైనా, భవిష్యత్‌పైనా విశ్వాసం తగ్గుతోంది. తాజాగా రిజర్వ్‌బ్యాంకు ప్రకటించిన నివేదిక కూడా ఇదే తేల్చి చెప్పేసింది. కొవిడ్ ప్రభావంతో ప్రజల్లో విశ్వాసం ఎలా సన్నగిల్లిపోతోందో వివరిస్తూ ఒక నివేదికను ప్రకటించింది. అయితే సమస్యను వాస్తవాలకు దగ్గరగానే విశ్లేషించిన రిజర్వ్‌బ్యాంకు పరిష్కార సూచనలో మాత్రం తప్పుడు సిఫార్సులు చేయడం గమనార్హం. ప్రజలకు భారంగా ఉన్న అనేక సంస్కరణలను ఇంకా కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా చేతిలో నగదు ఉన్నంతవరకు ప్రజల్లో విశ్వాసం అధికంగా ఉంటుంది. భవిష్యత్తుపైనా ఆశలు పెంచుకుంటారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రజల ఆర్ధిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం పడుతోందని రిజర్వ్‌బ్యాంకు విశ్లేషించింది. కరోనా ప్రారంభమైన 2019 మార్చిలో వంద శాతానికిపైగానే ఉన్న విశ్వాసం ఆ ఏడాది మే నుంచి క్రమంగా తగ్గిపోతూ వస్తున్నట్లు గుర్తించింది. 2020 మార్చి నాటికి 85 శాతం మాత్రమే విశ్వాసం లెవెల్స్ నమోదుకాగా, 2020 సెప్టెంబర్ నాటికి 50 శాతానికి గ్రాఫ్ పడిపోయింది. ఆ తరువాత కొద్దిగా కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, తరువాత 2021 మే, జూలై నెలల్లో 45 శాతం వరకు తగ్గిపోయినట్లు పేర్కొంది. దాదాపుగా ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా కొంతవరకు ఉంటుందన్న హెచ్చరికలు కూడా రిజర్వ్ బ్యాంకు చేయడం గమనార్హం.
ఉపాథిపైనా కాటు
కరోనా తొలి రెండు దశల్లో ఉపాధిపైనా పెను ప్రభావం చూపించినట్లు రిజర్వ్‌బ్యాంకు గుర్తించింది. 2019 మార్చికి ముందు వరకు ఉపాధి రంగం మెరుగ్గానే ఉన్నప్పటికీ కరోనా కారణంగా తరువాత నుంచి క్షీణిస్తూ వచ్చింది. 2020 సెప్టెంబర్ నాటికి 60 శాతం వరకు నష్టం కలిగినట్లు ఆర్‌బిఐ పేర్కొంది. తరువాత మళ్లీ కొంతవరకు పుంజుకుని, 2021మే నాటికి మళ్లీ క్షీణత కనిపించింది. దీనివల్ల కూడా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లినట్లు ఆర్‌బిఐ వివరించింది. వచ్చే ఏడాది వరకు ఈ పరిస్థితి కొనసాగే ప్రమాదం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
ఖర్చుపైనా ప్రభావం
కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ గణనీయంగా దెబ్బతినడంతో వినియోగదారుల వ్యయం కూడా తగ్గిపోయినట్లు గుర్తించింది. 2020 మార్చి నుంచి వ్యయం రంగంలో ప్రభావం చూపించడం ఆరంభమైనట్లు ఆర్‌బిఐ గుర్తించింది. మొత్తం వ్యయంలో 20 శాతం తగ్గిపోగా, సెప్టెంబర్‌లో సాధారణ పరిస్థితికి చేరుకున్నట్టే కనిపించిన వ్యయం మళ్లీ ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభమైనట్లు ఆర్‌బిఐ వివరిం చింది. 2021 సెప్టెంబర్ నాటికి 15 నుంచి 20 శాతం వ్యయ శక్తి వినియోగదారుల్లో తగ్గిపోయినట్లు పేర్కొంది.
సంస్కరణలపై ఆర్‌బిఐ ఆపేక్ష
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణలపై దేశ వ్యాప్తంగా విమర్శలు పెరుగుతున్నప్పటికీ రిజర్వ్‌బ్యాంకు మాత్రం తాజా కొవిడ్ పరిస్థితుల్లో సంస్కరణలు కొనసాగించాలనే సూచించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రయివేటీకరణకు పెద్దపీట వేస్తున్న కేంద్రానికి రిజర్వ్‌బ్యాంకు కూడా మద్దతు పలుకుతున్నట్లే ఉందని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు ఇంకా ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉందని వారంటున్నారు.










