'నలంద' విద్యార్థులకు ఎంఇఒ ప్రశంసా
ప్రజాశక్తి-కావలి : నవభారత రాష్ట్రీయ జ్ఞాన పీఠ వారు నిర్వహించిన పోటీ పరీక్షలలో విజయం సాధించిన నలంద టాలెంట్ స్కూల్ విద్యార్థినులు పి.సువర్ణిక, వి.హర్షితలను శుక్రవారం ఎంఇఒ కె.శ్రీధర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభను కనబరిచిన సువర్ణికను, హర్షితను గూర్చి మాట్లాడుతూ వీరు భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేగాక పిల్లలలోని నైపుణ్యాన్ని, ప్రతిభను గుర్తించి ప్రతియేటా ఎంతోమంది పిల్లలను పోటీ పరీక్షల కోసం తయారు చేస్తూ ఉన్న నలంద యాజమాన్యాన్ని, టీచర్లను కూడా అభినందించారు. ఈ సందర్భంగా నలంద విద్యాసంస్థల చైర్మన్ ఎమ్‌డి మజహర్ మాట్లాడుతూ తాను స్థాపించిన ఈ నలంద విద్యాసంస్థల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వారిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలియజేశారు. తమ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో నలంద విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపల్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










