Feb 27,2022 11:19

వెండితెరపై తెలుగమ్మాయిలు క్రమం తప్పకుండా మెరుస్తూనే ఉన్నారు. వాళ్లకి తగిన ప్రోత్సాహం దక్కాలంతే. 'గద్దలకొండ గణేష్‌' ప్రత్యేక గీతంలో డింపుల్‌ హయాతిని చూడగానే 'ఈ అందం సూపర్‌హిట్టు' అనేశారు ప్రేక్షకులు. ఇటీవల విడుదలైన 'ఖిలాడి'లోనూ సందడి చేశారు. త్వరలో గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో డింపుల్‌ మాట్లాడుతూ 'గద్దలకొండ గణేష్‌' చిత్రానికి ముందు అనేక ఆఫీసుల చుట్టూ తిరిగానని, నల్లగా, రంగు తక్కువగా ఉన్నాననే కారణంగా అనేక తిరస్కారాలు ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రం విజయం సాధించిన సందర్భంగా డింపుల్‌ గురించిన మరిన్ని విశేషాలు..!

పేరు : డింపుల్‌ హయాతి
ముద్దు పేరు : డింపుల్‌
పుట్టిన తేదీ : ఆగస్టు 21, 1998
పుట్టిన ప్రాంతం : విజయవాడ
నివాస ప్రాంతం : హైదరాబాద్‌
చదువు : గ్రాడ్యుయేషన్‌
హాబీస్‌ : డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, రీడింగ్‌
ఇష్టమైన నటులు : విజరు సేతుపతి, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌

తెలుగమ్మాయి డింపుల్‌ హయాతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ ఒకప్పుడు అవకాశాల కోసం తిరిగి తిరిగి, అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. 'గల్ఫ్‌' అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నటి హయాతి గద్దలకొండ గణేష్‌ సినిమాలో 'జర్రా జర్రా' ఐటెం సాంగ్‌తో స్టార్‌ అయిపోయారు. ఆ తర్వాత హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు.
డింపుల్‌ హయాతి రవితేజ సరసన చేసిన 'ఖిలాడి' సినిమా ఇటీవలే విడుదలై, భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం డింపుల్‌ చేతిలో ఒక తమిళ్‌ సినిమా, రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇటీవల 'ఆత్రంగి రే' సినిమాతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను పడిన సినిమా కష్టాల గురించి వివరించారు.
'గద్దలకొండ గణేష్‌ సినిమా ముందు వరకూ చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నల్లగా, రంగు తక్కువ ఉన్న కారణంగా ఎన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నానో లెక్కేలేదు. ఫెయిర్‌ స్కిన్‌ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్లు. నల్లగా ఉన్నాను పనికిరాను అనేవాళ్లు. అప్పుడు కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో గద్దలకొండ గణేష్‌లో పాట చేశా. ఆ తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. కానీ నటిగా నిరూపించుకోవాలని ఐటెం సాంగ్స్‌ మళ్లీ చేయలేదు. ఇప్పుడు 'ఖిలాడీ' సినిమాతో నటిగా నిరూపించుకోబోతున్నాను. ప్రస్తుతం చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత ఐటెం సాంగ్స్‌ వస్తే మళ్లీ చేస్తాను' అని హయాతి తెలిపారు.
లుక్‌ టెస్ట్‌ కెరీర్‌లో తొలిసారి..
'రమేష్‌ వర్మ నా ఫొటోలు చూశారు. కథ చెప్పాక, ఒక వారంలో లుక్‌ టెస్ట్‌ అన్నారు. రవితేజ, నేను, మీనాక్షి చౌదరీని కలిపి లుక్‌ టెస్ట్‌ చేశారు. లుక్‌ టెస్ట్‌ అనేది నా కెరీర్‌లో తొలిసారి. ఆ తర్వాత నన్ను ఎంపిక చేశారు. రవితేజ నన్ను ఎంతో ప్రోత్సహించారు. పక్కింటి అమ్మాయిగానూ, గ్లామరస్‌గా కనిపించే ట్రెండీ అమ్మాయిగానూ రెండు రకాలుగా కనిపించే పూర్తిస్థాయి పాత్ర నాది. నటిగా నాకు సంతృప్తినిచ్చిన పాత్ర. నట ప్రయాణం గురించి ఎలాంటి కలలు కన్నానో.. అలాంటి పాత్రనే చేశా. చిత్రీకరణ చాలా తృప్తినిచ్చింది. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. విశాల్‌తో కలిసి చేసిన ''సామాన్యుడు''లోనూ పూర్తిస్థాయి కథా నాయికగా నటించా. హిందీలో ''అత్రంగీ రే'' చిత్రంలో చిన్న పాత్ర చేశా. అదీ మంచి గుర్తింపు తెచ్చింది!' అని చెప్పారు.
ఇప్పుడు ఆ కోణం మారుతోంది..
'ఇప్పటివరకైతే పరిశ్రమ స్పందన సానుకూలంగానే ఉంది. చాలామందికి ఎదురైనట్టుగానే కొన్ని మంచి, చెడు అనుభవాల తర్వాత ఇక్కడి వరకూ వచ్చా. పరిశ్రమలో తెల్లటి రంగుకీ, అందానికే ఎక్కువ ప్రాధాన్యం. ఇప్పుడు ఆ కోణం మారుతోంది. ప్రతిభకి తగ్గ ప్రాధాన్యం దక్కుతోంది. ఇదొక మంచి పరిణామం. అయితే గతంలో ఓ అగ్ర దర్శకుడితో పెద్ద సినిమా చేశా. అందులో ప్రధాన కథానాయికని. 90 శాతం చిత్రీకరణ అయ్యాక అది ఆగిపోయింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే 'గద్దలకొండ గణేష్‌'లో ప్రధాన కథానాయిక పాత్ర కోసం నన్ను ఆడిషన్‌ చేశారు దర్శకుడు హరీష్‌శంకర్‌. అప్పటికే ఆ పెద్ద సినిమా చేస్తుండడంతో కాల్షీట్లు కేటాయించలేకపోయా. కానీ అంతలోనే ఆ చిత్రం ఆగిపోవడంతో తీవ్ర నిరాశకి గురయ్యా. అది హరీష్‌శంకర్‌కి తెలిసి, ప్రత్యేక గీతం చేయమని చెప్పారు. ఆయన్ని నమ్మి చేశా. అది నా కెరీర్‌ని మలుపు తిప్పింది!' అని వివరించారు.
సినిమా అంటే పిచ్చి..
'మా ఇంట్లో ప్రతి ఒక్కరూ నటులే, ప్రతి ఒక్కరూ నృత్యకారులే. విజయవాడలో పుట్టా, హైదరాబాద్‌లో పెరిగా. అంతకుమించి నా కుటుంబ నేపథ్యం గురించి చెప్పను. స్వశక్తితోనే వచ్చాను, నా గుర్తింపునే నేను స్వీకరిస్తా. నా అసలు పేరు డింపుల్‌. మరీ చిన్నగా ఉందని, సంఖ్యాశాస్త్రం ప్రకారం హయాతి అని అదనంగా జోడించా. చిన్నప్పుడే నేను హీరోయిన్‌ని అని చెప్పుకొనేదాన్ని. నాకు సినిమా అంటే అంత పిచ్చి. కథానాయిక ఓ తెలుగమ్మాయి అనగానే ఇంతవరకే చేయగలదని, ఆమెని ఇలాగే చూడగలం అని ముందే కొన్ని హద్దులు గీస్తుంటారు. వాటిని చెరిపేయడమే లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నా. నా ఆలోచనలు ఆధునికంగా ఉంటాయి' అంటారు హయాతి.