ప్రజాశక్తి-సోమందేపల్లి : మండల కేంద్రంలోని నక్కలగుట్ట (చౌడేశ్వరీకాలనీ) లో ఇంటి స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారధి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మొదటి విడతలో 601 పట్టాలు,తరువాత 305 పట్టాలు నిరుపేదలకు ఇచ్చామన్నారు. ఇంటిస్థలాలు ప్రస్తుతం ఆక్రమణకు గురవుతున్నాయన్నారు. అయితే ఎమ్మెల్యే శంకరనారాయణ కు భయపడి అధికారులు వీటిని పట్టించుకోవటం లేదని విమర్శించారు.ఈ అక్రమాలపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. నక్కలగుట్టలో శంకరనారాయణ అనుచరులు, వారి తొత్తులు ఒక్కక్కరు నాలుగు ఫ్లాట్లను కబ్జాలు చేసి ఒకో ఫ్లాటు లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కబ్జాకు గురైన చోట ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను కోరారు. ఈ సమావేశంలో నాయకులు సిద్దలింగప్ప, భానుకీర్తి, సంజీవరెడ్డి, రామకృష్ణ, నీరుగంటి చంద్ర, సర్పంచి నరసింహ, సూరి, కిష్టప్ప, గుట్టే గోవిందు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.










