నకిలీ రిజిస్ట్రేషన్లకు అధికారుల సహకారం
ప్రజాశక్తి-కావలి
కలెక్టర్ ఆదేశించినా లెక్క చేయకుండా బోగోలు మండల తహశీల్దార్, రెవెన్యూ అధికారులు తమ పొలాన్ని ఆక్రమించుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్న బిజెపి నేత సన్నిగంటి శీనయ్యకు సహకరిస్తున్నారని రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయకపోతే సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటామని బోగోలు మండలం, అల్లిమడుగు పంచాయతీ తెల్లగుంట గ్రామస్తులు గడ్డం తిరపతి, వంశీ, కుమారీలు వాపోయారు. సోమవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బోగోలు మండలం అల్లిమడుగు పంచాయతీ తెల్లగుంట గ్రామంలో సర్వే నెంబర్ 521/2లో తమ తాతల కాలం నుంచి 10 ఎకరాల 4 సెంట్లు పొలం ఉండగా దానిలో 4 ఎకరాల పొలం గడ్డం తిరపతి పేరుపై ఉందన్నారు. అయితే తమ నాన్నకు ఆరోగ్యం బాగా లేక గత కొన్ని సంవత్సరాలుగా కావలి అంబేద్కర్ నగర్‌లో గేదలు పెట్టుకొని జీవిస్తున్నట్లు కుమారుడు గడ్డం వంశీ తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో తాము సాగు చేయకపోయే సరికి అదే గ్రామానికి చెందిన బిజెపి నేత సన్నిగంటి శీనయ్య తమ పొలాన్ని ఆక్రమించుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. అయితే విషయం తెలుసుకున్న తాము బోగోలు మండల తహశీల్దార్ లక్మీనారాయణకు అర్జీ రూపంలో వివరించామన్నారు. వారు స్పందించకపోతే సమాచార చట్టం ప్రకారం గతంలో తమ భూమి వివరాలు అన్ని సేకరించామన్నారు. తాము సేకరించిన వివరాలలో తమ భూమి నాలుగు ఎకరాలుగా పొందిపరిచినట్లు ఉన్నా, రెండు ఎకరాలేనంటూ అధికారులు కులం పేరుతో దూషణలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే న్యాయం కోసం తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తీసుకుని స్పందన కార్యాక్రమంలో రెండు సార్లు జిల్లా కలెక్టర్‌ను కలిశామన్నారు. కలెక్టర్ స్పందించి తహశీల్దార్‌కు భూమిని కొలతలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు స్పందించటం లేదన్నారు. బిజెపినేత సన్నిగంటి శీనయ్య ఏం చేసాడో తెలియదుకానీ రెవెన్యూ అధికారులు తమ మాట తీసుకోకపోగా దుర్బాషలాడుతున్నారని వాపోయారు. అలానే ఈ మధ్యకాలంలో తమ తల్లిదండ్రులపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారన్నారు. తమకు ప్రాణహాని ఉందని తమ కుటుంబానికి ఏం జరిగినా వారే కారణమన్నారు. అలానే బోగోలు మండల రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయకపోతే సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో శివతదితరులు పాల్గొన్నారు.










