Feb 06,2022 09:27
  • పునరావాస కల్పనకు రెండు దశాబ్దాలుగా మీనమేషాలు
  • 18ఏళ్లు నిండినవారికి అందని ప్యాకేజీ
  • జలదిగ్బంధాల మధ్య పుట్టెడు సమస్యలతో సహవాసం
  • పెద్దగెడ్డ, తోటపల్లి నిర్వాసితుల దుస్థితి

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : సాగునీటి అవసరాల కోసం తరతరాలుగా నమ్ముకున్న పంట భూములు, పుట్టిపెరిగిన గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితులపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ముంపు గ్రామాలపేరిట అభివృద్ధి పనులు నిలిచిపోవడం.. మరోవైపు జలాశయాల నీటి ఊట, పాములు, తేళ్లు వంటి విష సర్పాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం మలేరియా, డెంగీ వంటి విష జ్వరాల బారినపడు తున్నా.. తాగునీటికి ఇబ్బంది పడుతున్నా.. పాలకులకు, ప్రభుత్వానికి పట్టడం లేదని నిర్వాసిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.
    విజయనగరం జిల్లాలోని తోటపల్లి, పెద్దగెడ్డ, పెదంకలాం జలాశయాల అభివృద్ధి పనులను జిల్లాకు చెందిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు ఇటీవల ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయా జలాశయాల పరిధిలోని నిర్వాసితుల సమస్యలను 'ప్రజాశక్తి' కదిలించింది. నిర్వాసితుల్లో ఎవరిని కదిపినా కన్నీటి వ్యథే కనిపించింది. మూడు మండలాల పరిధిలో 12,220 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పాచిపెంట మండల కేంద్రానికి సమీపాన 2003లో రూ.4,667లక్షల ప్రారంభ వ్యయంతో తలపెట్టిన పెద్దగెడ్డ నిర్మాణానికి మాజీ సిఎం చంద్రబాబు శంకు స్థాపన చేశారు. 2006లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలాశయాన్ని ప్రారంభించారు. జలాశయం ఏర్పాటుకు కోటికిపెంట, కేశలి పంచాయతీల పరిధిలోని కోడికాళ్లవలస, మడవలస, తురాయిపాడు, రాళ్లగెడ్డ, ఎగువకుమ్మరివలస, యర్రోడ్లవలస గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. ఈ గ్రామాల పరిధిలోని సుమారు 803 కుటుంబాల వారికి నష్టపరిహారం చెల్లించి, పునరావాసం నిమిత్తం కోడికాళ్లవలస సమీపంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గృహ నిర్మాణానికి అప్పట్లో రూ.55వేలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణాలకు సరిపడా డబ్బులు చెల్లించాలని లేదా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, 18ఏళ్లు నిండినవారికి నష్టపరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పట్లో ఎపి నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన బాధితులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. సుమారు వంద మంది నిర్వాసితులు అష్టకష్టాలు పడి చిన్నా చితక ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. జలాశయానికి వంద మీటర్ల దూరంలోవున్న కొటికిపెంట, కేశలి పంచాయతీ కేంద్రాలకు చెందిన 570మంది ఇల్లు నిర్మించలేదు. మరో 133 మంది ఇల్లు నిర్మాణం ప్రారంభించినా నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. అప్పట్లో 18ఏళ్లు నిండిన యువతీ యువకులు పరిహారం కోసం ఎదురు చూసిన వారు ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుని, పిల్లల్ని కనడంతో వారికి కూడా ప్రస్తుతం ఇళ్ల స్థలాల అవసరమౌతున్నాయి. మరోవైపు 18ఏళ్లు దాటినవారి సంఖ్య ప్రస్తుతం 40నుంచి 100కు పెరిగిపోయింది. వీరంతా పరిహారంతోపాటు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని, లేదంటే ఎలా బతుకుతామని ప్రశ్నిస్తున్నారు. తోటపల్లి నిర్వాసితులైన సుంకి, నందివానివలస, బాసంగి, పిఆర్‌ఎన్‌ వలస గ్రామాలకు చెందిన 1800 నిర్వాసిత కుటుంబాల వారికి స్థలాలు కేటాయించిన్పటికీ ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేయలేదు. వీరు కూడా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పిఆర్‌ఎన్‌ వలస, బంటువానివలస పరిధిలో సుమారు వందమందికి పట్టాలిచ్చినప్పటికీ స్థలాలు చూపించడం లేదు.
 

                                                    దోమలు, విష సర్పాలతో సహవాసం

ముఖ్యంగా కొటికిపెంట, కేశలి గ్రామాలు వర్షాకాలంలో నీటిపోటుకు గురౌతూనే వున్నాయి. గ్రామాలకు ఆనుకుని నీరువుండ డంతో దోమల సమస్యతో నిత్యం డెంగీ, మలేరియా బారినపడుతున్నామని, సంపాదన అంతా ఆసుపత్రుల్లో వైద్యానికే సరిపోతుందని కొటికిపెంట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిగోడలు నీటిచెమ్మతో వుండడం వల్ల పాములు, తేళ్లు వంటి విష సర్పాలు స్వైరవిహారం చేస్తున్నాయని కేశలి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటికిపెంటలో శిథిలావస్థకు చేరిన పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. కోటవానివలస నిర్వాసితులకు ఇళ్లు నిర్మించినప్పటికీ రహదారి సదుపాయం కల్పించలేదు.

                                                          17 ఏళ్లుగా ఇదిగో.. అదిగో..

భూములు తీసుకున్నప్పుడు నాకు, మా అన్నకు 18 ఏళ్లు. రూ.55 వేల నష్టపరిహారం అదిగో ఇదిగో అంటూనే 17 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు మా ఇద్దరితోపాటు తమ్ముడికి కూడా పెళ్లిళ్లయి చేతికందొచ్చే పిల్లలున్నారు. స్థలమున్నా ముంపు గ్రామం కాబట్టి నిర్మించుకునే వీల్లేదు. పరిహారంతో పాటు ఇంటి స్థలం ఇవ్వాలని మొరపెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పంట్ల భాస్కరరావు, కేశలి గ్రామం

                                                            రూ.55 వేలతో ఎలా ?

అప్పట్లో భూములను కారుచౌకగా లాగేసుకు న్నారు. తీరా ఇల్లు నిర్మాణానికి రూ.55 వేలే ఇస్తామ న్నారు. ఆ డబ్బులు ఎటూ సరిపోయే పరిస్థితి లేకపోవడంతో సాయం పెంచాలని కోరాం. ఇప్పటికీ స్పందించకపోవడంతో ఇల్లు నిర్మించు కోలేకపోతు న్నాం. నిత్యం ముంపు సమస్య ఎదుర్కొంటున్నాం. పాము కాటుకు, విష జ్వరాల బారినపడుతున్నాం. సంపాదించిన డబ్బాంతా వైద్యానికే చాలడం లేదు.
                    - కర్రి నూకరాజు, కొటికిపెంట గ్రామం