రాజంపేట అర్బన్ : యువత అన్ని రంగాలలో రాణించాలని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించామని కలెక్టర్ గిరీశ, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శనివారం అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో మెగా జాబ్‌మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులు మెగా జాబ్‌మేళాలో వచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇవ్వడంలో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. నిరుద్యోగులు చిన్న ఉద్యోగమైనా నిరాశ పడకుండా ఉద్యోగంలో చేరి అంచలంచెలుగా ఎదగాలన్నారు. యువతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశ్యంతో సిఎం జగన్ మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని, జాబ్‌మేళా అనేది నిరంతర ప్రక్రియ అని, చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగిగా మిగుల కూడదు అనేది లక్ష్యమన్నారు. జాబ్‌మేళాలో 8 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 100 కంపెనీలు ఇక్కడకు వచ్చాయని తెలిపారు. జిల్లాలోని విద్యార్థులందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని, అందరూ ఉద్యోగాలు పొందాలన్నారు. ఒక వ్యక్తి ఉద్యోగం పొందాలంటే ఎక్కడికో వెళ్లి అక్కడ గదికి అద్దె కడుతూ ఇబ్బందులు ఎదుర్కోవాలని, ఇలాంటి జాబ్ మేళాలలో అటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం పొందవచ్చన్నారు. అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత 3 జాబ్ మేళాలు జరిగాయని, దాదాపు 6 వేల మందికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వంలోనే చాల ఉద్యోగాలు ఉన్నాయని, వాటిని కూడా యువత సరైన నైపుణ్యాలతో పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాజంపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎస్‌పి గంగాధర్‌రావు, రాజంపేట సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అన్నమాచార్య కళాశాల గౌరవ కార్యదర్శి డాక్టర్ చొప్పా గంగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు(ఎన్‌ఆర్‌ఐ) రత్నాకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్‌ఎంవి నారాయణ, రాజంపేట, రైల్వేకోడూరుతో పాటు పొరుగు మండలాల నుంచి ఈ మెగా జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు పాల్గొన్నారు.










