Feb 11,2022 08:12
  • ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
  • పోలీసుల నిర్బంధాలు.. నాయకుల అరెస్టు

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ, విద్యార్థి, యువజనులు రోడ్డెక్కారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు తదితర సంఘాల ఆధ్వర్యంలో గురువారం 'చలో కలెక్టరేట్‌' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని భగం చేసేందుకు పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కలెక్టరేట్లకు చేరుకునే అన్ని మార్గాలను నిర్బంధించి ఎక్కడికక్కడ నాయకులను, విద్యార్థులను అరెస్టు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నియామకాలు చేపట్టాలని.. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాలని విద్యార్థులు, నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు.
   తూర్పుగోదావరి జిల్లాలో బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు. కాకినాడలో కలెక్టరేట్‌కు వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. నిర్బంధాలను అధిగమించి ధర్నా చౌక్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు వీరికి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తుందన్నారు. ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం వల్ల నిరుద్యోగులు నష్టపోతారన్నారు. అనంతరం నాయకులతో కలిసి ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. విజయవాడ లెనిన్‌సెంటర్‌ నుంచి సబ్‌కలెక్టరేట్‌కు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్‌ చేశారు. అరెస్టులకు ముందు నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ప్రసన్నకుమార్‌, అశోక్‌, ఎఐఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు జాన్సన్‌బాబు, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై రాము, తెలుగు యువత, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు శ్రావణ్‌కుమార్‌, శ్రీనివాస్‌ మాట్లాడారు. విజయనగరంలోని కోట జంక్షన్‌ నుంచి పెద్ద చెరువు మీదుగా కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను, నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలను ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. జిల్లా పరిషత్‌, కలెక్టరేట్‌, డిఇఒ కార్యాలయం, కొత్త బస్టాండ్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఐడికార్డు ఉన్నవారు మాత్రమే కలెక్టరేట్‌ వైపు వెళ్లాలని ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
విశాఖలో కలెక్టరేట్‌ వైపు వస్తున్న అన్ని వాహనాలను తనిఖీలు చేశారు. పోలీసుల వలయాన్ని దాటుకుని కలెక్టరేట్‌కు చేరుకున్న 40 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎయు నిరుద్యోగ జెఎసి, యూనివర్సిటీ ప్రొగ్రెసివ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యాన ఆంధ్రా యూనివర్సిటీ నుండి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన తెలిపారు. అనకాపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఆర్‌డిఒ కార్యా లయం వరకు ప్రదర్శన నిర్వహించి, ఆర్‌డిఒ కార్యాల యాన్ని ముట్టడించారు. శ్రీకాకుళంలో చలో కలెక్టరేట్‌కు బయలుదేరిన విద్యార్థి సంఘాల నాయకులను, నిరుద్యోగులను ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, జిల్లా కేంద్ర గ్రంథాలయం, 80 అడుగుల రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కొందరు పోలీసుల కళ్లు గప్పి కలెక్టరేట్‌కు చేరుకున్న వారినీ పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాలో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి నాయకులను అరెస్టు చేశారు. కలెక్టరేట్‌ వద్ద ముళ్లకంచెను రోడ్డుగా అడ్డుగావేశారు. పోలీసుల కళ్లుగప్పి కలెక్టరేట్‌కు చేరుకున్న కొంతమంది విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. కర్నూలులో నిరుద్యోగులు కలెక్టరేట్‌ వద్దకు వచ్చి నిరసన తెలియచేయకుండా ఎక్కడికక్కడ ఉద్యోగ పోరాట సమితి నాయకులను ముందస్తుగానే అరెస్ట్‌ చేశారు. అనంతపురం జిల్లాలో కలెక్టరేట్‌కు వెళ్లే దారులన్నింటిలోనూ పోలీసులు భారీగా మోహరించారు.కలెక్టరేట్‌కు వచ్చే వారిని ఎక్కడికక్కడే అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న, తదితరులను అరెస్టు చేసి సాయంకాలం విడుదల చేశారు. తిరుపతిలో విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచి గురువారం మధ్యాహ్నం విడిచిపెట్టారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు సుమారు 60 మందిని అరెస్టు చేసి పట్టణంలోని వివిధ స్టేషన్లకు తరలించారు. ఒంగోలు పోలీసుల ఆంక్షలు ధిక్కరించి.. కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరులో పలువురు విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.
 

                                                    నియమకాలు చేపట్టాలి : సిపిఎం

విజయవాడలో అరెస్టు చెసిన విద్యార్థి, యువజన నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌ బాబూరావు, కృష్ణా జిల్లా (పశ్చిమ) కార్యదర్శి డి.వి.కష్ణ స్టేషన్ల వద్దకు వెళ్లి పరామర్శించారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని పేర్కొన్నారు.