Jan 31,2022 19:44

న్యూఢిల్లీ : ఇటీవల బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ పరీక్షల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యర్థులు చేపట్టిన నిరసనలు దేశంలో పెరుగుతున్న ఉద్యోగ సంక్షోభానికి సూచికలు. ఈ నిరుద్యోగం ఊహించిన దాని కన్నా తీవ్రంగా ఉంది. దీన్ని బీహార్‌, యుపి వరకే చూడలేం. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలు, రిక్రూట్‌మెంట్‌ బోర్డులో తప్పులు దొర్లడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం విచారకరం. అప్పటికప్పుడు కమిటీలంటూ కప్పదాటు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ చర్యలు నిరుద్యోగిత శాతాన్ని పెంచుతాయి కానీ.. తగ్గించవన్న విషయం గమనార్హం.

ఉద్యోగాలు వేలల్లో..దరఖాస్తులు కోట్లల్లో
బీహార్‌లో 35 వేల ఆర్‌ఆర్‌బి గ్రూప్‌ సి పోస్టులకు గానూ అక్కడ 1.25 కోట్ల మంది అభ్యర్థుల నుండి దరఖాస్తులు వచ్చాయంటే... నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీహార్‌లో పరిశ్రమలు కూడా అంతంత మాత్రమే. ఫలితంగా ప్రయివేటు ఉద్యోగాలు రావడం లేదు. చదువుకున్న యువత బతుకుదెరువు కోసం ఏం చేయాలి..? ఇతర ప్రాంతాలకు వెళ్లాలి లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతుండాలి. సహజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే కాంక్షతో ఉంటారు. ఎందుకంటే.. అదొక భరోసాను, ఉద్యోగ భద్రతను ఇస్తుంది. బీహార్‌లో ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూసే అభ్యర్థులు కోకొల్లలు. ఇలా ప్రకటన పడితే.. అలా లక్షల్లో దరఖాస్తులు వచ్చి చేరతాయి. దాదాపు 20 లక్షల మంది యువకులు ఏటా రైల్వేలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నారంటే .. నిరుద్యోగం తీవ్రత స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

నిరుద్యోగ భారత్‌.. యువతలో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం

రైల్వే, బ్యాంకు ఉద్యోగాలకున్న క్రేజ్‌
దేశంలో రైల్వేలు, బ్యాంకు ఉద్యోగాలకున్న కేజ్ర్‌ చాలా ఎక్కువ. బీహార్‌ వాసులు కూడా వీటికే ఎంతో ఆసక్తి కనబరుస్తారు. కారణం రైల్వేలో గ్రూప్‌ డి నుండి ఎ వరకు నెల జీతం .. ఫ్రెషర్లకే రూ. 17 వేల నుండి రూ. 50 వేల వరకు ఉంటుంది. కెరీర్‌లో ఎదిగే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. చాలా కష్టంగా నెలకు రూ. 4 వేల సంపాదిస్తున్న వ్యక్తి రూ. 17 వేలు అంటే చాలా ఎక్కువ. అలాంటిది వారి భవితవ్యాన్ని బుగ్గిపాలు చేస్తే నిరుద్యోగులు చూస్తూ ఊరుకుంటారా.. లేదు కదా. అదే యుపి, బీహారుల్లో జరిగింది. అందుకే ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ యువత రణరంగాన్ని సృష్టించారు.

బీహార్‌లో బడితో ఆగిపోతున్న చదువులు
బీహార్‌లో 18-23 సంవత్సరాల వయుస్సు గల వారు సుమారు 1.25 కోట్ల మంది ఉన్నారు. వీరంతా కాలేజీలకు వెళ్లాల్సిన వారే. కానీ ఇందులో 10వ తరగతి పాసైన వారు 50 లక్షల మంది, 12 పాసైన వారు 35 లక్షలు, 25 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉండాలనేది ఒక అంచనా. కానీ వారి పరిస్థితులు బడి వరకే పరిమితం చేశాయి. దీంతో నిరుద్యోగ యువత శాతం పెద్ద సంఖ్యలో పేరుకుపోయింది. దీంతో ఆ కాస్త చదువుకు ఉపాధి పొందేందుకు ఎంచుకుంటున్న ఏకైక మార్గం ప్రభుత్వ ఉద్యోగం. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. కారణం ప్రభుత్వ ఉద్యోగ సంస్థలను ప్రైవేటీకరణ, డిజిటలైజేషన్‌, ఆటోమేషన్‌ కింద ఉద్యోగాలకు కోత పడింది. యుపిఎస్‌సి వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు కూడా తగ్గాయి. గత ఏడాది లోక్‌సభలో కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం.. యుపిఎస్‌సి ఉద్యోగాల్లో దాదాపు 30 శాతం తగ్గింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డిఒపిటి) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాళీలు, నియామకాలు క్యాడర్‌ నిర్వహణకు సంబంధించిన అంశం. యుపిఎస్‌సినే కాదు ఇతర రిక్రూట్‌మెంట్‌ బోర్డులైన సాఫ్ట్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరిస్థితి మరీ దారుణం. 2013లో ఎస్‌ఎస్‌సిలో 20 వేల పోస్టులు ఉండగా.. 2018కి 12 వేలకు తగ్గాయి.. ప్రస్తుతం 8-9 వేల ఖాళీలున్నాయి. ఉన్న ఉద్యోగాలు తక్కువ. వీటిల్లో అవకతవకలకు పాల్పడుతూ...పరీక్షల నిర్వహణలో నిజాయితీ లేకపోవడం, ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనకు కట్టుబడకపోవడంతో యువత ఆందోళనలు చేపడుతున్నారు.

నిరుద్యోగ భారత్‌.. యువతలో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం

తాత్కాలిక ఊరడింపే
ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి పరీక్షల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఆందోళనకు దిగిన విద్యార్థులను శాంతింపజేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి సమస్య ముందే తెలిసినా.. యుపిలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపధ్యంలో ఈ కమిటీ ఏర్పాటు ఓ వ్యూహమనే చెప్పాలి. అది తాత్కాలిక ఊరడింపు మాత్రమే. నిజంగా అభ్యర్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందా అంటే లేదనే చెప్పాలి. దీంతో వారి సమస్యలు మళ్లీ బేతాళుడు-విక్రమార్కుడు కథ చందంగా మారాల్సిందే. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ డేటా నిరుద్యోగి రేటు 8 శాతానికి పెరిగిందని చెప్పింది. ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనలో చేతులేత్తేశాయి. విడుదల చేసే ఉద్యోగాల్లో కోత కూడా యువతలో నిరుత్సాహంతో కూడిన ఆగ్రహాన్ని పెంచుతోంది.