Dec 02,2020 07:57

ఎవడో ధారాదత్తం చేసినవి కాదు
ఉత్త పుణ్యానికి ఊడిపడ్డవేం కాదు
ధర్మ బద్దంగా అంకురించిన హక్కుల్ని
నలుపు చట్టాలతో హరింపజూస్తే
సహించే చచ్చు దద్దమ్మలం కాం
మీ చీకటి 'ఎజెండా'కు జైకొట్టే
అమాయకులు ఎవరూ లేరిక్కడ
ఉద్యమాల ఊపిరిగా పీల్చినోల్లం
పౌరుషాల ఉగ్గుపాలు పట్టినోల్లం
ప్రతిబంధకాల అధిగమించినోల్లం
పోరాటాలు మాకు కొత్తేమి కాదు
మీ వాటర్‌ ఫిరంగులు
బ్యారికేడ్లు, బందోబస్తులు
లాఠీలు తూటాల మోతలు
నిర్బంధాలు నిలువరించలేవు
అదిగో అటు చూడు !
హస్తినాపుర సరిహద్దుల్లో
ఉద్యమ పిడికిలెత్తుకున్నరు
ధిక్కార స్వరాలు ఎగుస్తున్నరు
నిరసన జెండాలు ఎగురుతున్నరు
లక్ష్యం ముద్దాడుదాక పట్టు వీడమంటూ
కర్షక శక్తులు భీష్మించుకు కూర్చున్నరు
ప్రజా వ్యత్రిరేక ఏలికలారా!
అన్నదాత రెక్కల కష్టం కాజేసి
కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టు
మీ నల్ల చట్టాలు ఉపసంహరిస్తే సరి
కాదు కూడదు అంటే...
మీ ఢిల్లీ పీఠాలు కదలక తప్పదు
ఎర్రకోటపై కర్షక జెండా ఎగురుట ఖాయం

- కోడిగూటి తిరుపతి,
సెల్‌ :9573929493