Jan 31,2023 21:18

2023-24 బడ్జెట్‌

       అనంతపురం ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో బుధవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యత లభిస్తుందోనని జిల్లావాసులు ఎదురు చూస్తున్నారు. గడచిన కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు ఎలాంటి చెప్పుకోదగ్గ కేటాయింపులూ చేయలేదు. జిల్లా వాసులు ప్రతిసారీ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకోవడం తరువాత ఉసూరుమనడం పరిపాటి అయ్యింది. ఈ సారైనా కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు న్యాయం చేసేలా కేటాయింపులు ఉండాలని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం అనేక హామీలను ఇచ్చింది. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి అనేక వాటికి నిధులను మంజూరు చేయాల్సి ఉంది. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అభివృద్ధికి సంబంధించి కేటాయింపులు నిరాశనే మిగులుస్తూ వస్తున్నాయి. రైల్వే, విభజన హామీల అమలు దేనికైనా ఇదే రకంగా ఉంటున్నాయి. రాష్ట్ర విభజన జరిగి దశబ్ధకాలం పూర్తవుతున్నా విభజన హామీల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
విభజన హామీలు
విభజన హామీల్లో ఒకటైన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటై ఐదేళ్లు కావస్తున్నా పూర్తి స్థాయిలో ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికీ శాశ్వత భవనాలే లేవు. తాత్కాలిక భవనాలు, అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు కనీసం వసతి గృహ సౌకర్యం కూడా సరిగా లేదు. విద్యార్థులు తరచూ ఈ సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేయడం పరిపాటిగానే మారుతోంది. బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద స్థల కేటాయింపులు జరిగినా శాశ్వత భవన నిర్మాణాలకు నిధుల కేటాయింంపులు ఆశించినంత జరగలేదు. కేటాయింపులు జరిగినా నిధులు మంజూరవలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లోనైనా కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపులు జరుగుతాయా.? లేక ఎప్పటిలాగానే మొక్కుబడి నిధుల కేటాయింపులే జరుగుతాయా.? అన్నది చూడాల్సి ఉంది. ఇక నాసన్‌ సంస్థకు 2015లోనే శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభమవలేదు. తాజాగా 2022లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ వచ్చి శంకుస్థాపన చేశాక పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదికైనా దీని నిర్మాణ పనులు పూర్తి స్థాయి అవుతాయా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది. మరో సంస్థ 'బెల్‌'కు 2015 సెప్టంబరులో శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ ఇది ప్రహరీ నిర్మాణానికే పరిమితమైంది. ఈ ఏడాది ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కాని పూర్తి స్థాయి పనులు ఎప్పటికి ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి ఉంది.
రైల్వే నిధుల కేటాయింపులు పెరిగేనా.?
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గుంతకల్లు డివిజన్‌ అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఉంది. ఇటు ఉత్తర భారతానికి, ఇటు దక్షిణ భారతదేశానికి కలిపే కీలకమైన డివిజన్‌ గుంతకల్లు. ఈ డివిజన్‌కు నిధుల కేటాయింపులు మొదటి నుంచి అరకొరగానే ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా కొత్త రైలు ఒక్కటీ దీని పరిధిలో వేయలేదు. ప్రకటిచిన రైల్వేలైన్లే దశాబ్ధాలుగా నడుస్తూనే ఉన్నాయి. రాయదుర్గం-తుంకురు, కడప-బెంగళూరు, డోన్‌-గుంటూరు డబ్లంగ్‌ ఇలా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. వీటికి ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయింపులు పెంచి పనులు పరుగులు పెట్టిస్తారా.? లేక ఎప్పటిలాగానే అరకొర కేటాయింపులతో నత్తనడకన నడిపిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వాసులు మాత్రం ఈ సారైనా కేంద్రం నిధుల విడుదలలో కనికరం చూపకపోతుందా అని గంపెడాసతో ఎదురుచూస్తున్నారు.