పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత గల భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పరిష్కరించి పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లీనిక్‌లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సకాలంలో పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడపగడపకులో వచ్చే వినతులకు పరిష్కారం చూపాలన్నారు. నాడు-నేడు కింద పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 88 అర్జీలను అధికారులు స్వీకరించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఏర్పాటు
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీని నియమించినట్లు కలెక్టర్ బసంత్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో కలెక్టర్‌కు జిల్లా అధ్యక్షుని హోదా కల్పించారు. అడహాగ్ కమిటీ ఛైర్మన్‌గా జిఎం.శేఖర్, వైస్ ఛైర్మన్‌గా పోల లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి, కోశాధికారిగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ జిబి.విశ్వనాధ్, కమిటీ సభ్యులుగా తల్లపల్లి భయారెడ్డి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ కనకే రాజు, సాయి దర్శిని, రంజిత దేవి, పశిరి శంకర్ రావు, రఘునాథరెడ్డి, నాగరాజు, బోయ ఆదినారాయణ, నియమితులయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో కార్యక్రమాలు చేపడతామన్నారు.










