ప్రజాశక్తి - రామసముద్రం : జగనన్న ఇళ్ల నిర్మానాలకు నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ గిరీష అన్నారు. బుధవారం మండలంలోని కాప్పల్లి, చెంబకూరు గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూమెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్‌ఎల్‌ఎ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆరాతీశారు. ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తి చేశారు, ఆర్‌ఎల్ స్టేజీలో ఉన్నవి ఆర్‌సికి తీసుకురావాలని, ఆర్‌సి స్టేజ్‌లో ఉన్న ఇళ్లను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. కాప్పల్లి సచివాలయం పరిధిలో 152 ఇళ్లు మంజూరు కాగా 51 పూర్తయ్యాయనీ, బిఎల్ 24, బిబిఎల్ 29, ఆర్‌ఎల్ దశలో 22 ఉన్నాయన్నారు. రామసముద్రం మండలంలో 25 శాతం ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదని, త్వరగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒను కలెక్టర్ ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉండాల్సిన వయస్సుకు తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్న చిన్నారులపై పర్యవేక్షణ చేయాలని మహిళా పోలీస్, ఎఎన్‌ఎంను ఆదేశించారు. సచివాలయం పరిధిలో ఎంత మంది గర్భిణిలు ఉన్నారు, ఎంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారు వంటి వివరాలను ఎఎన్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల్లో రక్తహీనతను దూరం చేయడానికి పోషకాహారమైన భోజనం తీసుకునేలా మరింత అవగాహన కల్పించాలన్నారు. చెంబకూరు గ్రామ సచివాలయంలో ఆర్‌ఎల్ 53 ఇళ్లు ఉన్నాయని వాటిని ఆర్‌సికి తీసుకురావాలని ఇంజినీర్ అసిస్టెంట్‌కు సూచించారు. 66 బిబిఎల్‌లో ఉన్న ఇళ్లను బిఎల్ కు తీసుకురావాలన్నారు. రెవెన్యూ సమస్యలపై మాట్లాడుతూ విఆర్‌ఒ మ్యుటేషన్ సరిగా చేస్తున్నారా లేదా అనే విషయాలను గ్రామస్తులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో బరువు తక్కువగా, ఎత్తు పెరగకపోవడం ఉన్న వారిని డాక్టర్ వద్ద రెగ్యులర్‌గా చెకప్ చేయించి బరువు, ఎత్తు పెరిగే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. పింఛన్ల వెరిఫికేషన్ సాయంత్రంలోగా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సచివాలయంలో సేవలు బాగా అందిస్తున్నారా లేదా వంటి వివరాలను కలెక్టర్ గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులకు సంబంధించి 30 శాతం పెండింగ్ ఉందని, పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఇస్తున్నామని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వెలేార్‌ే అసిస్టెంట్లు తరచూ పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన రుచిని చూడాలన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించాలన్నారు. మండల పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన సచివాలయ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డిఎల్‌పిఒ లక్ష్మీపతి, ఎంపిడిఒ సురేష్ బాబు, తహశీల్దార్ విశ్వేశ్వర శాస్త్రి, ఇఒపిఆర్‌డి చలపతి రావు, ఎఒ మోహన్ కుమార్, ఎంఇఒ హేమలత, ఎపిఒ గౌరీ శంకర్, ఎపిఎం సుబ్రమణ్యం, సర్పంచ్ నారాయణమ్మ, రమణమ్మ, కన్వీనర్ భాస్కర్ గౌడ్, వైస్ ఎంపిపి రమణారెడ్డి పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష
మదనపల్లె అర్బన్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహాలను మంజూరు చేసిందని, జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు ముమ్మరంగా జరగాలని అధికారులను కలెక్టర్ గిరీష్ ఆదేశించారు. బుధవారం మదనపల్లె సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో మదనపల్లి అర్బన్, రూరల్ పరిధిలో జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఉపాధి హామీ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు, విఆర్‌ఒలు, హౌసింగ్ ఇంజనీర్లు, తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, పేద వారి ఇంటి కల నెరవేరేలా అధికారులు అందరూ చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డిఒ మురళి పాల్గొన్నారు.










