Sep 26,2023 20:54

నినాదాలు చేస్తున్న నాయకులు

నినాదాలు చేస్తున్న నాయకులు
నిర్భందాలతో ప్రజాఉద్యమాలు అడ్డుకోలేరు
-సిపిఎం నగర కమిటీ
ప్రజాశక్తి-నెల్లూరు:పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని, ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ఆపాలని డిమాండ్‌ చేస్తూ 27వ తేదీ బుధవారం వామపక్షాల ఆధ్వర్యంలో జరుగు భారీ ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. మంగళవారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో చిన్నబజార్‌ ప్రాంతంలోని పండ్ల మార్కెట్‌ సెంటర్‌ నుంచి జెండా వీధి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌ నుండి వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న భారీ ర్యాలీని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం కరెంటు చార్జీలు భారీగా పెంచారని ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ట్రూ అప్‌ చార్జీలు,సర్దుబాటు చార్జీలు మొదలైన పేర్లతో వాడిన కరెంట్‌ బిల్లు కన్నా అదనపు చార్జీలు ఎక్కువ అవుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిరసన తెలియజేస్తున్న వారిపై ప్రభుత్వం దుర్మార్గంగా నిర్భంధం ప్రయోగిస్తున్నదని అని అన్నారు. అంగన్వాడీలు వారి సమస్యలపై నిరసన ర్యాలీ చేపడితే ఇళ్ల వద్ద అరెస్ట్‌ లు చేయడం, పోలీస్‌ స్టేషన్‌ లకు తీసుకువెళ్లడం, అక్రమ కేసులు బనాయించడం లాంటి చర్యలకు పూనుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. వీటికి నిరసనగా కార్యక్రమం చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావును, సిపిఎం రాష్ట్ర నాయకులను అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడుతున్నాయని అన్నారు. అందరూ ఐక్యంగా నిలబడి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగేశ్వరావు, పి. సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ, శాఖా కార్యదర్శులు ఏ. శ్రీనివాసులు రెడ్డి, ఫయాజ్‌ , పండ్ల మార్కెట్‌ యూనియన్‌ నాయకులు బసవయ్య, మాల్యాద్రి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.