మాచాపురం గ్రామంలో అనీల్ అనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును వృధా చేయకుండా కొద్దికొద్దిగా బ్యాంకులో దాచుకోవడం అతనికి అలవాటు. అలా దాచిన డబ్బుతో ఏదో ఒక వస్తువు కొనుగోలు చేసి, వాడుకునేవాడు.
అలా ఒకసారి వెయ్యి రూపాయల నోట్లు, చిల్లర ఇరవై రూపాయలతో కొత్తగా తెరిచిన బూట్ల షాపులోకి వెళ్ళాడు. ఎప్పటి నుంచో బూట్లు కొనాలన్న కల తీరుతున్నందుకు సంతోషపడ్డాడు. షాపులో ఒక జత బూట్లు బాగా నచ్చాయి అనీల్‌కి. యజమాని దగ్గరకు వెళ్లి బేరమాడాడు. యజమాని ఒకే మాటగా వెయ్యి యాభై రూపాయలు ఇవ్వమన్నాడు. అంతకన్నా తక్కువకు రావని కచ్చితంగా చెప్పాడు. అనీల్ జేబులోంచి వెయ్యి రూపాయలు నోటు తీసి, యజమాని టేబుల్ పైన పెట్టాడు. అయినా యాభై రూపాయలు ఇవ్వాల్సిందేనని యజమాని పట్టు పట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ ద్వారా యాభై రూపాయలు ఆన్లైన్ బ్యాంకింగ్ పంపి, జత బూట్లతో అనీల్ ఇల్లు చేరుకున్నాడు. కొత్త బూట్లు తెచ్చుకున్న ఆనందంతో వాటిని వేసుకుని మిత్రుల దగ్గరికి పరిగెత్తాడు.
అనీల్ కొత్త బూట్లు చూసిన మిత్రులందరూ బూట్ల రంగు బాగున్నాయని అభినందించారు. ఆనందంతో మిత్రులందరికీ హోటల్లో చారు ఆర్డర్ చేశాడు. అనీల్ చారు తాగాక జేబులోని ఇరవై రూపాయల చిల్లర కోసం చేయి పెట్టగానే నోట్లు తగిలాయి. తీసి చూడగానే ఒక్కింత ఆశ్చర్యపోయాడు. బూట్ల షాపులో వెయ్యి రూపాయలు టేబుల్‌పై పెట్టి మళ్లీ ఎప్పుడో జేబులో పెట్టుకున్నట్లు గుర్తొచ్చింది. ఆన్లైన్ ద్వారా మిగతా యాభై రూపాయలు చెల్లించి, బూట్లతో ఇంటికి తిరిగొచ్చినట్లు మిత్రులకు చెప్పాడు. వావ్ యాభై రూపాయలకే బూట్లు తెచ్చుకున్నావు. ''అదృష్టమంటే నీదేరా'' అంటూ మిత్రులు చప్పట్లు కొట్టారు. బూట్ల కొనుగోలు ముచ్చట ఎవరికి చెప్పినా, వెయ్యి రూపాయలతో పండగ చేసుకో అన్నారు. రాత్రి కావొస్తుందని, అనీల్ నెమ్మదిగా ఇల్లు చేరాడు.
రాత్రి భోజనం చేసి పడుకున్న అనీల్‌కు సరిగా నిద్ర పట్టడంలేదు. అటూఇటూ పొర్లుతూ యాభై రూపాయలకే బూట్లు కొన్న సంఘటన గుర్తు తెచ్చుకుని, ముసిముసి నవ్వులతో నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఎప్పటిలాగే రోడ్డుపై వెళుతుండగా బూట్ల షాపు కనిపించింది. దానిని చూడగానే మనసొప్పక లోనికి వెళ్లాడు. అనీల్‌ను యజమాని ఏమాత్రం గుర్తు పట్టలేదు. వెయ్యి రూపాయలు ఇవ్వమని అడగలేదు. కానీ అతనే యజమాని దగ్గరకు వెళ్ళి, వెయ్యి రూపాయలు ఇచ్చి విషయం చెప్పాడు. ఆయన అనీల్ నిజాయితీని మెచ్చుకున్నాడు. ఇంకో జత బూట్లు ఇచ్చి, నీలాంటి వాళ్లు ఈ కాలంలో ఉండడం గొప్ప విషయం అని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు అనీల్ నిజాయితీని మెచ్చుకున్నారు. నీవు ఎప్పుడూ ఇలానే ఉండాలని చెప్పారు. అనీల్ కూడా జీవితాంతం నిజాయితీగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఉండ్రాళ్ళ రాజేశం
99669 46084