నిజాం దొరలా 'రామిరెడ్డి' వ్యవహారశైలి
- అఖిలపక్ష నేతల విమర్శ
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి నిజాం పాలనను కొనసాగిస్తూ నిజాం దొరలా వ్యవహరిస్తున్నారని అఖిలపక్ష నేతలు చింతాల వెంకట్రావు (కాంగ్రెస్), పసుపులేటి పెంచలయ్య (సిపిఎం), కరవది భాస్కర్(సిపిఐఎంఎల్), కొప్పర్తి నాగరాజు (సిపిఐ), రుషికేష్ (జనసేన), వై.లక్ష్మారెడ్డి (సిపిఐ ఎంఎల్) ఆరోపించారు. శనివారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కావలి నియోజకవర్గంలో దళితులపై దాడుల పరంపర కొనసాగు తుందన్నారు. ముసునూరుకు చెందిన దుగ్గిరాల కరుణాకర్, కడనూతలకు చెందిన హర్షపై ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వేధింపులకు గురిచేస్తే వారు ఎంఎల్‌ఎ కాళ్లు పట్టుకున్నా కనికరించకపోతే, కరుణాకర్ చనిపోతే, హర్ష చావు బతుకల మధ్య కొట్టుమిట్టాడుతున్నారన్నారు. అవి మరవకముందే ఉలవపాళ్లకు చెందిన తేజపై అగ్రవర్ణాలకు చెందిన మహేష్ నాయుడు కులదురహంకారంతో కాళ్లతో, కర్రలతో, రాడ్డులతో దాడి చేసినట్లు వీడియోలు ఉన్నా, స్టేషన్ బెయిల్ ఇచ్చి, పంపించేటట్లు ఎంఎల్‌ఎ సహకరించారన్నారు. అలానే గతంలో ప్రజాసంఘాలలో పనిచేసి ఇప్పుడు దళిత నాయుకులుగా అవతారం ఎత్తి అధికార పార్టీకి చెందన దళిత నేతలు అసలు ఇంతవరకు బాధితుడు తేజాను పరామర్శించకుండా ప్రత్యక్షంగా వీడియోలు చూసి కూడా అగ్రవర్ణాలకు సపోర్టు చేస్తున్న ఈ దళిత నాయకులను చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో దళిత ఐపిఎస్ అధికారులు, డిఎస్‌పిలు ఉన్న చోటే దళితులపై దాడులు జరుగుతున్నా వారిలో స్పందన లేకపోగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న పెట్టీ కేసులున్నా, రౌడీషీట్‌లు ఓపన్ చేసే, పోలీసులు దళితులపై దాడులు చేసే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో? తెలపాలన్నారు. అలానే దళితులపై న్యాయం చేయని పోలీసులు, బాధితులపై న్యాయస్థానంలో పార్టీలకతీతంగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ న్యాయవాది చింతాల వెంకట్రావు (కాంగ్రెస్) ప్రకటించారు. అలానే పైడి హర్షను వేదించిన వారిపైన కేసులు నమోదు చేయాలని తేజపై వేధించిన వారిపై 307 బుక్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కృష్ణమెహన్, వెంకట సబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.










