పీలేరు : ప్రస్తుతం ఈ రాష్ట్రంలో తాము చేపట్టినది ధర్మ యుద్ధమని, ఇందులో నీతి, నిజాయితీకే ప్రజలు పట్టం కట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబు పేర్కొన్నారు. పీలేరు ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి రెండుసార్లు గెలిచినా నియోజకవర్గ ప్రజలకు చింతలే మిగిల్చారే తప్ప ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేవలం ఆయన అధికార ఎమ్మెల్యే మాత్రమేనని ఇక్కడ ఆజమాయిషి చలాయిస్తోంది పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, హరీష్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. ఆదివారం పీలేరు - చిత్తూరు మార్గంలోని భాస్కర్ ఐటిఐ సమీపంలో ఏర్పాటు చేసిన యువగళం పాదయాత్ర సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకష్ణారెడ్డి మాత్రమే బాగుపడ్డారని వాపోయారు. నియోజకవర్గంలో రూ.600 కోట్ల వారిలో వారు భాగస్వాములను తెలిపారు. పింఛ, బహుద, అన్నమయ్య ప్రాజెక్టుల పరిధిలో ఇసుకను దోపిడీ చేసి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. పీలేరు మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులైన వైసీపీ నాయకులు రూ. 500 కోట్ల రూపాయల విలువ చేసే 2వందల ఎకరాల భూమిని రాజేస్తుంటే దాన్ని బయట పెట్టింది తమ యువ నేత పీలేరు నియోజకవర్గం బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అని గుర్తు చేశారు. పీలేరులో 20 ఎకరాల ఏపీఐఐసీ భూములు ఉన్నాయని తాము అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పీలేరు, మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలను కలిపి మదనపల్లి జిల్లాను తీసుకొస్తామన్న హామీ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన మాటతప్పి ఫేక్ జగన్మోహన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అనుసరిస్తూ పెండింగ్‌లో ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారని, ఇప్పటివరకు వాటి ఊసే లేదని విమర్శించారు. అలాగే 2000 కానిస్టేబుల్ పోస్ట్లు, మెగా డిఎస్‌ని కూడా నిర్వహించలేదని కూడా నిర్వహించలేదని ఆరోపించారు. 45 ఏళ్లు వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తామని మాట మార్చారని విమర్శించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాట కూడా తప్పారని కూడా గుర్తు చేశారు. నెలవారి జీతాలు కూడా వారికి సరిగ్గా అందడం లేదని ఆరోపించారు. పోలీసులకు 4 సరెండర్లు, 8 టిఏ, డిఏ లు కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్ర ప్రదేశ్‌గా మార్చేవారని విమర్శించారు. టిడిపి పాలనలో 40,000 పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకు వచ్చారని గుర్తు చేశారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఒక్క అంతర్జాతీయ సంస్థ కూడా పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు రాలేదని పేర్కొన్నారు. వచ్చిన వారు కేవలం గిఫ్ట్‌ల కోసమే వచ్చారని ఎద్దేవా చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ కంపెనీ ఖాతాలో కనీస నిధులు లేకున్నా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటూ ముందుకొస్తే దానికి 25 వేల ఎకరాల భూమిని కేటాయించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం కావడం దురదుష్టకరమని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన హత్యల్లో 10 మంది మైనార్టీలు హతమయ్యారని, వారిపై 46 దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మెజార్టీ అందించి నారా చంద్రబాబు నాయుడును మరోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్నారు.
అడుగడుగునా జననీరాజనం
పీలేరు చేరుకున్న యువగాలం పాదయాత్రకు జనం నీరాజనం పట్టారు. యువ నాయకుడు లోకేష్ బాబుకు తెలుగు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువత జేజేలు పలుకుతూ ఆయన వెంట నడిచారు. యువగళం యాత్రలో లోకేష్ బాబు స్థానిక నాలుగో రోడ్ల కూడలిలో తెలుగు మహిళలతో మాట్లాడారు. అలాగే అంబేద్కర్ సర్కిల్లో ముస్లిం మైనార్టీ ప్రజలతో మాట్లాడారు. అదేవిధంగా అజంతా మెట్టపై, మదనపల్లి టర్నింగ్ లో, రైల్వే స్టేషన్ సమీపంలో, డిగ్రీ కళాశాల వద్ద కూడా ఆయన ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమాల్లో ఆయన వెంట రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని టిడిపి నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.










