Jul 14,2021 15:38

దేవీపట్నం (తూర్పుగోదావరి) : రాష్ట్రంలోనూ, ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నది ఉరకలు తీస్తూ.. దేవీపట్నం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద అంతకంతకూ పెరగడంతో పోచమ్మ గండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. దీంతో దర్శనాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయాన్ని ఆనుకొని ఉన్న ఇళ్లన్నీ నీట మునగడంతో బాధిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దేవీపట్నం, తొయ్యేరు మధ్య రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పూడిపల్లి, తొయ్యేరు, ఏవేరవరం, కేవేరవరం, దండంగి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. వరద నీరు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇటీవలే ప్రారంభించిన పోచమ్మ గండి నుంచి పాపికొండలు వెళ్లే విహారయాత్రను అధికారులు మళ్లీ నిలిపివేశారు.

నీట మునిగిన గండి పోచమ్మ గుడి.. విహారయాత్రకు మళ్లీ బ్రేక్‌..!