- ఈ ఏడాదికి 6 శాతమే లక్ష్ష్య సాధన
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : స్వచ్ఛమైన తాగునీరు అన్నది అనేక ప్రాంతాల్లో జనానికి కలగానే మిగిలిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో ఇంటింటికీ తాగునీటి కుళాయి పథకాన్ని ప్రారంభించినా, అది అనుకున్న లక్ష్యాలను సాధించలేపోతోంది. రాష్ట్ర వాటా నిధులను సకాలంలో భరించలేకపోవడంతో ఈ పథకానికి కష్టాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చివరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా వెనక్కు తిరిగివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జల్‌జీవన్ మిషన్ పథకం అమలులో రాష్ట్రం 17వ స్థానంలో ఉండాల్సి వచ్చింది. జల్‌జీవన్ మిషన్ ద్వారా కేంద్రం నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం, ఇచ్చిన నిధులను వ్యయం చేయడంలో రాష్ట్రం జాప్యమే ఈ పథకానికి శాపంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది కేంద్రం రూ.3,182 కోట్లను కేటాయించగా, అందులో రూ.791 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దానికి అదనంగా అంతకముందు నిధులు రూ.134 కోట్లు ఉండడంతో మొత్తం రూ.925 కోట్లు అందుబాటులో ఉన్నట్టయింది. ఈ నిధులకు రాష్ట్రం రూ.453 కోట్లను తన వాటాగా భరించాల్సి ఉన్నప్పటికీ ఆ నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. మొత్తం నిధుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం రూ.138 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఇక్కడ కూడా చేసిన వ్యయంలో రాష్ట్ర, కేంద్ర లెక్కల మధ్య భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. ఇచ్చిన నిధుల ఆధారంగా రూ.357 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర లెక్కల్లో రూ.218 కోట్లు తేడా ఉన్నట్లు తేలింది. ఇలా ఉన్న నిధులను సక్రమంగా ఖర్చు చేయలేకపోవడంతో ఏకంగా రూ.493 కోట్లను కేంద్రానికి తిరిగిచ్చేయాల్సి వచ్చింది. 34.47 లక్షల ఎఫ్‌హెచ్‌టిసి (ఫంక్షనల్ హౌస్‌హౌల్డ్ ట్యాప్ కనెక్షన్లు) కేటాయించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 13 శాతంతో 4.61 లక్షల కనెక్షన్లు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా 54 వేల వరకు కేటాయించాల్సి ఉండగా, ప్రస్తుతం 1,487 మాత్రమే ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో 7,800 గ్రామాల్లో ట్యాప్ పనులు ప్రారంభించగా, ఇరకా 7,879 గ్రామాల్లో ప్రారంభించాల్సి ఉంటుంది. కేంద్రం ప్రకటించిన ఏస్పిరేషనల్ జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నంలో కూడా కుళాయి పనులు తక్కువ స్థాయిలోనే జరుగుతున్నట్లు సమాచారం.










