Sep 02,2023 23:23

  • నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు
  • పారిశుధ్య కార్మికులుగా మారిన క్లాప్‌ మిత్రాలు
  • షెడ్ల వద్ద మౌలిక వసతుల లేమి

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి
''క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యం, గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నాం'' అని ఏడాది క్రితం ప్రభుత్వం చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమం అమలవుతోందని జిల్లా అధికారులు చెబుతున్న మాటలను క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం లక్ష్యం ఆచరణలో నీరుగారుతోంది. స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ నుంచి క్లాప్‌ మిత్రాల వేతనాలు నిలిచిపోవడం, మౌలిక వసతులు సమకూరకపోవడంతో జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది.
కోడూరు మండలంలో లింగారెడ్డిపాలెం, పోటుమీద, జయపురం, మాచవరం, రామకృష్ణాపురం, వి.కొత్తపాలెం ఆరు పంచాయతీల్లోనూ చెత్త సేకరణ జరగడం లేదు. అవనిగడ్డ పంచాయతీలో క్లాప్‌మిత్రాలు సేకరించిన చెత్త డంపింగ్‌ యార్డుకు తరలిపోతోంది. గతంలో పనిచేసిన మొవ్వ, పెదపారుపూడి గ్రామ పంచాయతీల్లోని సంపద కేంద్రాలు మూతపడ్డాయి. జివో నంబర్‌ 680 ప్రకారం కేంద్ర ప్రభుత్వ గ్రాంటు రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటు రూ.4 వేలు కలిపి రూ.10 వేలు ఇవ్వాలని అడిగినందుకు కృత్తివెన్ను మండలం పాండ్రాక గ్రామ పంచాయతీలో ఆరుగురు క్లాప్‌ మిత్రాలను పంచాయతీ పాలకవర్గం తొలగించింది. సంపద కేంద్రాన్ని మూతవేసింది. తోట్లవల్లూరులో సంపద తయారీ కేంద్రాన్ని ఆరేళ్ల క్రితం కృష్ణానది ఒడ్డున నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో వేసిన తాటాకు కప్పును తొలగించి ఏడాదిన్నర క్రితం రేకుల షెడ్‌గా మార్చారు. అది ఇప్పటికీ నిరుపయోగంగానే దర్శనమిస్తోంది. దీంతో గ్రామంలో సేకరించిన చెత్తను కృష్ణా కరకట్టపైన వేస్తున్నారు. జిల్లాలో 491 గ్రామ పంచాయతీలకుగానూ 472కుపైగా గ్రామ పంచాయతీల్లో లక్షలాది రూపాయలు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించి షెడ్లను నిర్మించారు. వాటిల్లో సింగిల్‌ డిజిట్‌ గ్రామ పంచాయతీల్లో కూడా చెత్త నుంచి సంపద సృష్టి జరగడంలేదు.
పంచాయతీ పారిశుధ్య కార్మికుల్లా మారిన క్లాప్‌ మిత్రాలు!
250 గృహాలకు ఒకరు చొప్పున జిల్లాలోని 491 గ్రామ పంచాయతీల్లో 2,685 మంది క్లాప్‌ మిత్రాలను నియమించాలి. షెడ్‌ మేనేజ్‌మెంట్‌కు వాచ్‌మెన్లను, సూపర్‌ వైజర్లను నియమించాలి. ఆదిశగా చర్యలు లేవు. అవసరమైన సిబ్బందిలో సగం మందిని కూడా గ్రామ పంచాయతీల్లో నియమించలేదు. 1273 మంది క్లాప్‌ మిత్రాలు మాత్రమే పనిచేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ వరకు క్లాప్‌ మిత్రాల వేతనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా విడుదల చేశాయి. ఆ తర్వాత నుంచి నిలిపివేడంతో పంచాయతీల నిధుల నుంచే క్లాప్‌ మిత్రాలకు వేతనాలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా వెసులుబాటులేని మైనర్‌ పంచాయతీలకు సంపద కేంద్రాల నిర్వహణ భారంగా మారింది. వేతనాలు చెల్లిస్తున్న గ్రామ పంచాయతీలు నిర్ధేశించిన చెత్త సేకరణ, సంపద కేంద్రాల నిర్వహణ విధులు అప్పగించకుండా పంచాయతీల్లో పారిశుధ్య, ఇతర అవసరాలకు వారిని ఉపయోగించుకుంటున్నాయి. సంపద కేంద్రాల నిర్వహణ గాలికి వదిలేశాయి.
మౌలిక వసతుల లేమి
సంపద తయారీకి షెడ్ల వద్ద చెత్త కటింగ్‌ మిషన్‌, చెత్తను కుళ్లబేట్టేందుకు వాటర్‌ బోర్‌, ఎరువు తయారీకి వానపాములు, ఇతర యంత్రాలు, విద్యుత్‌ సౌకర్యం అవసరం. గ్రామాల్లో చెత్త సేకరణకు 967 ట్రేసైకిళ్లకుగాను 547 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 645 ట్రేసైకిళ్లు స్వచ్చాంధ్ర కార్పోరేషన్‌ సమకూర్చాల్సి ఉంది. 322 షెడ్లకు విద్యుత్‌ సౌకర్యం లేదు. 251 షెడ్లకు వాటర్‌ కనెక్షన్లు లేవు. 73 షెడ్లకు రోడ్డు వసతి లేదు. ఈ మౌలిక వసతులు సమకూర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో స్వచ్ఛ సంకల్పం లక్ష్యం నీరుగారుతోందనే చర్చ జరుగుతోంది.