ప్రజాశక్తి - కడప అర్బన్ : ప్రముఖ కథా రచయిత రాయలసీమ కథారత్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి సోమవారం తెల్లవారు జాములన 5.30 గంటలకు ఒంగోలులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తెలుగు సాహిత్యంలో కథకునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా నిరంతర సృజనశీలిగా సుప్రసిద్ధులైన ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి 1939, జులై 10న కడప జిల్లా, కమలాపురం మండలం, రంగసాయిపురంలో కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. జి.ఎన్.రెడ్డి. పర్యవేక్షణలో కడప జిల్లా గ్రామ నామాలు అనే అంశం మీద పరిధోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆయన మొదటి నుంచి తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి శాస్త్రీయ దృక్ఫథంతో మానవ సంబంధాలను విశ్లేషించి రచనలు చేశారు. విశ్వనాథరెడ్డి జిల్లా, గ్రామ నామాలపై లోతైన పరిశోధన చేసి విశిష్టిమైన పంథాలో పరిశోధన చేశారు. గ్రామ నామాలను, ఆ గ్రామాల జీవిన విధానాన్ని, ఆచార వ్యవహారాలను, ఆర్థిక అసమానతలను పరిశీలించి వెలువరించిన అధ్యయన ఫలితాలు ప్రశంసనీయం, ఈ పరిశోధన తరువాత తరాలవారికి మార్గదర్శకమైన అనేక నిఘంటువుల రూపకల్పనకు దారితీసింది. ఆయన హఠాన్మరణం జిల్లాలోని సాహితీ లోకాన్ని తీవ్ర ద్రిగ్భాంతికి గురిచేసింది. ఆయన మృతి సందర్భంగా పలువురు సంతాపం తెలిపారు. కేతు విశ్వనాథ్‌రెడ్డి మృతి పట్ల సి.పి.బ్రౌన్ భాష పరిశోధన కేంద్రం సంచాలకులు మూల మల్లికార్జునరెడ్డి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కురువృద్ధులు, రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ బండి లెనిన్ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమారస్వామి అన్నారు. కేతు సాహితీలోకానికి తీరని లోటని సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామమోహన్ పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్‌సిఇఆర్‌టి సంపాదకుడుగా వ్యవహరించారని తెలిపారు. కేతు మరణం బాధాకరమని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. వారి కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రామిక జనపక్షపాతి కేతు మరణం బాధకరమని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం కడప డివిజన్ అధ్యక్షులు అవధానం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు.
నేడు కడప 'కేతు' పార్థివదేహం
కేతు విశ్వనాథరెడ్డి మృదేహం ఒంగోలు లోని కూతురు ఇంటి నుంచి మంగళవారం మధ్యాహ్నం కడపకు తీసుకువస్తారు. సింగపూర్ టౌన్‌షిప్‌లోని ఆయన సొంత ఇల్లు 'అపేక్ష' వద్ద అభిమానుల సందర్శన కోసం ఉంచుతారు. ఆమెరికాలో ఉన్న ఆయన కుమారుడు, కుమార్తెలు మంగళవారం అక్కడి నుంచి బయలుదేరి బుధవారం కడప చేరుకుంటారు. అదేరోజు కేతు సొంతూరు రంగశాయిపురం (ఎర్రగుంట్ల మండలం) తీసుకుపోతారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం దహన సంస్కారాలు ఉంటాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేతు సతీమణి పద్మావతమ్మ ఆదివారం ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. కూతురు అమ్మవద్దే ఉంది. కేతు, ఆయన అల్లుడు ఆదివారం రాత్రి ఇంటిలోనే ఉన్నారు. సోమవారం తెల్లవారు జాములన కేతు అల్లుడిని లేపి ఊపిరాడడం కష్టంగా ఉందని చెప్పారు. వెంటనే ఆయనను ఆదే సంఘంమిత్ర ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు కేతును వెంటిలేటర్ మీదకు చేర్చే సరికే ఆ సాహితీ వటవృక్షం వేలాడిపోయింది. ఆదే ఆసుపత్రిలో గుండె పరీక్షలు చేసుకుంటున్న పద్మావతమ్మకి తెలిస్తే ఆమెకేమవుతుందోనని ఇంత వరకు భర్త మరణ వార్తను తెలియకుండా దాచాల్సి రావడం ఇంకో విషాదం.










