Dec 07,2022 22:21

పాఠశాల వద్ద నిల్వ ఉంచిన ఇసుక, రాళ్లు

ప్రజాశక్తి మడకశిర : పట్టణంలోని 8వ వార్డులో ఉన్న శివాపురం పాఠశాల అభివృద్ధికి నాడు నేడు పథకం కింద నిధులు విడుదల అయినా పనులు ప్రారంభం కాలేదు. నాడు -నేడు రెండవ విడత ద్వారా పట్టణంలోని ఎనిమిదవ వార్డులో వుంటున్న శివాపురం ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.10. 99 లక్షల నిధులను నాడు నేడు పథకం కింద విడుదల చేసింది. నిధులు విడుదలై ఎనిమిది నెలలు గడచినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. ఇక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల మధ్య సఖ్యత లేకపోవటం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ప్రారంభం కాలేదన్న విమర్శలు వినపడుతున్నాయి. అయితే పనులు ప్రారంభిస్తున్నట్లు చూపిస్తూ ఇప్పటికే రూ.60 వేలు డ్రా చేసినట్లు సమాచారం. నెల క్రితం డ్రా చేసిన నిధులతో కొద్దిపాటి పునాదిరాళ్లు, ఒక టిప్పర్‌ కంకర పాఠశాల ఆవరణంలోకి తరలించి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. నిర్మాణం పేరుతో తరలించిన ముడి సరుకు మాత్రం నిత్యం విద్యార్ధులను ఉపాధ్యాయులను వెక్కిరిస్తు కన్పింస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. పనులు ప్రారంభం కాని విషయంపై ఎంఇఒ భాస్కర్‌ను సంప్రదించగా ప్రధానోపాధ్యాయులు అనారోగ్యం పాలవటంతో వారి స్థానంలో మరో ఉపాధ్యాయునికి బాధ్యతలు అప్పగించామన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.