Jan 22,2023 20:41

మురుగునీటిని తలపిస్తున్నకోనేరులో నీరు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నవ నరసింహ ఆలయాల్లో కదిరి నారసింహులు క్షేత్రం ఒకటి. ప్రహ్లాద సమేత విగ్రహం కదిరిలో తప్ప మరెక్కడ కనిపించదు. ప్రతి ఏడాది మాఘ మాసంలో శుద్ధ విదియ నాడు ప్రారంభమయ్యే శ్రీవారు బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు భక్తులను కనువిందు చేస్తాయి. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తడం ఇక్కడ మనం చూడవచ్చు.
ఇంతటి విశిష్టత కలిగిన ఆలయానికి సౌకర్యాల గ్రహణం పట్టి పీడిస్తోంది. శ్రీవారి భక్తులకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కోనేరులో స్నానం చేయడానికి వెళ్తే ఇది కోనేరేనా అన్న సందేహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది.ఒకప్పటి స్వామివారి ఇష్టమైన భవనాసినితీర్థం మద్దిలేరు వాగు ఇప్పుడు పట్టణంలోని నివాసాల మురుగునీటితో నిండిపోయింది. ఆ మురుగునీరు కోనేరులోకి ప్రవహించకుండా అడ్డుకట్ట వేసేందుకు కోనేరు అభివృద్ధి కొరకు రెండు సంవత్సరాల క్రితం ఆలయ నిధులు రూ. 2.20 కోట్లు వెచ్చించారు. అంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కోనేరు వద్ద మురుగునీరు దర్శనమిస్తోంది. ఇందులో స్నానం ఎలా అని పలువురు ముక్కున వెలేసుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి నామమాత్రం పనులు చేసి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. శ్రీవారి దర్శన భాగ్యం కోసం సుదూర ప్రాంతాలైన కర్నాటక, తమిళనాడు నుండి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యం లేదు. అదేవిధంగా దర్శనం కోసం వచ్చే భక్తుల నుండి వాహనాల పార్కింగ్‌ కొరకు రుసుం వసూలు చేస్తున్నప్పటికీ సరైన పార్కింగ్‌ సదుపాయం లేదు. దీంతో పట్టణంలో ఎక్కడపడితే అక్కడ ఆలయం తిరువీధుల్లో ,నివాసాలు, ఆలయం ముందర, పరిసర ప్రాంతాల్లో హిందూపురం ప్రధాన రహదారిపై బయట నుంచి వచ్చే భక్తులు వాహనాల ఉంచడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది.
వసతి సముదాయాలు కరువు ....
శ్రీవారి దర్శన భాగ్యం కోసం వచ్చే భక్తులు స్వామివారి చెంత సేద తీరుదామని ఒకటిరెండు రోజులు ఉందామని అనుకుంటే సరైన వసతి సముదాయాలు లేవు. దీంతో వారు ప్రయివేటు లాడ్జిలను ఆశ్రయించాల్సి రావడంతో అధిక మొత్తం వెచ్చించి బస చేయలేక వచ్చిన రోజే దర్శన భాగ్యం చేసుకొని వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయ వార్షికాదాయం రూ. 10 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయల ఆలయానికి వస్తున్నప్పటికీ చిన్నపాటి అభివృద్ధి పనులు చేయాలన్నా విరాళాలు సేకరించడానికి భక్తుల కోసం గాలం వేయడం ఇక్కడి ఆలయ అధికారులు ఆనవాయితీగా చేసుకున్నారు. అధికారులు, పాలక వర్గ సభ్యుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుండీల ద్వారా వచ్చిన ఆదాయం బంగారు ఇతర వస్తువులు కలుపుకుంటే దాదాపు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఇంత ఆదాయం ఉన్నప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాలలో అపరిశుభ్రత దర్శనమిస్తోంది. పాదరక్షకులు, వాహన రుసుం, సర్వదర్శన టికెట్టు రుసుము ఇలా రకరకాల పేర్లతో భక్తుల వద్ద ముక్కు పిండి నగదును వసూలు చేస్తున్న ఆలయ అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలం అయ్యారన్న విమర్శలు వినపడుతున్నాయి. ఆలయ సమీపంలో టెంకాయ, పూలమాల విక్రయాల్లో వందల రూపాయల ధరలు పెంచి వసూలు చేస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో భక్తాదులు ఆలయానికి గోవులు సమర్పించారు. దేవస్థానానికి సంబంధించిన వందల గోవులు గతంలో ఉండటంతో గోశాల కోసం గాండ్లపెంట మండలం కటారుపల్లి వద్ద ఆలయ నిధులతో గోశాల ఏర్పాటు చేశారు. ఆ గోశాల ఇక్కడికి 13 కిలోమీటర్ల దూరం కావడంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో భక్తులు దేవస్థానానికి అందజేసిన గోవుల సంరక్షణ కరువై పట్టణంలో ఎక్కడబడితే అక్కడ రోడ్లపై ఉండడంతో ప్రమాదాలకు గురై మృత్యువాత పడడంతో నేడు పదుల సంఖ్యకు చేరుకున్నాయి. ఆలయ గోవులను సంరక్షించుకోవడానికే అధికారులకు, పాలకులకు చేతగానిపనిగా మారిందన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ఎక్కడా గోశాల లేనప్పటికీ గోశాల పేరుతో లక్షలాది రూపాయలు విరాళాలు సేకరిస్తూ ఇతర కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారని అయితే భక్తుల నుంచి వసూలు చేస్తున్న విరాళాలు ఎక్కడికి వెళుతున్నాయని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఎలాంటి ప్రయోజనము లేకుండా భృగతీర్థాన్ని వదిలేయడం ఎంతవరకు సబబు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఆలయ ఆస్తుల వివరాలు బహిరంగంగా ప్రకటించాలి
స్వామివారి ఆస్తులు,నిధులు ఏ మేరకు ఉన్నాయో బహిరంగంగా ప్రకటించి వాటినే అభివృద్ధికి ఖర్చుపెట్టి త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు కోనేరును శుభ్రపరచాలని, భక్తులకు సౌకర్యాలను చేసి చూపించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.
ఏందప్పాసామీ... కోనేరు ఇలా ఉంది... ?
ఏందప్పా సామీ కోనేరు ఇలా ఉంది.మా ఇంటి ఇలవేల్పు దేవుడు కదిరి లక్ష్మీనరసింహస్వామి. ప్రతి సంవత్సరం స్వామి దర్శనానికి వస్తాము. ఎప్పుడూ కోనేరులో నీరు పోసుకుందామన్నా కోనేరు అధ్వానంగా ఉంటోంది. పాచి పట్టి, బురద కాలువను గుర్తుకు తెస్తోంది. ఇప్పుడు గతంలో కంటే అధ్వానంగా ఉంది.కర్నాటక రాష్ట్రం గౌరీబిదనూరు నుంచి చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కోనేరు చాలా అధ్వానంగా తయారైందని చెబుతుంటారు . కనీసం ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలకైనా బాగు చేస్తారా అని అనుమానం కలుగుతోంది.
కర్నాటక భక్తురాలు
కోనేరు ను చూస్తే కన్నీరు వస్తుంది
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భృగతీర్థాన్ని (కోనేరును) చూస్తే ఇది ఒకప్పటి కోనేరేనా అన్న అనుమానం కలుగుతుంది. ప్రభుత్వనిధులు కాకపోయినా, ప్రజాప్రతినిధులతో చేత కాకపోయినా భక్తుల సమర్పిస్తున్న హుండీ ఆదాయంతోనైనా అభివృద్ధి పనులు చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు కనీసం నెలకు రెండు మూడు సార్లైనా కోనేరును సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను వాతావరణాన్ని చూడకపోవడం బాధాకరంగా ఉంది. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కోనేరును అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
రమేష్‌, భక్తుడు