- నత్తనడకన ధాన్యంసేకరణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. కొనుగోలు కేంద్రాల ద్వారా (పిపిసి) రోజుకు 50 వేల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ప్రస్తుతం రోజుకు 10 వేల టన్నులు మాత్రమే సేకరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో లక్షలాది టన్నుల పొలాలకే పరిమితమైనాయి. ప్రస్తుతం 8,789 ఆర్‌బికెలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది.
గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో కొనుగోలు పూర్తి మందకొడిగా సాగుతోంది. ఖరీఫ్ 2015-16లో 44.01 లక్షలు, 2016-17లో 38.62 లక్షలు, 2017-18లో 41.59 లక్షలు, 2018-19లో 44.45 లక్షలు, 2019-20లో 47.83 లక్షలు, 2020-21లో 47.32 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత రెండు సంవత్సరాల్లో ఫిబ్రవరి 25 నాటికి ఖరీఫ్ ధాన్యం సేకరణ వివరాలు పరిశీలిస్తే 2019-20లో 42.56 లక్షలు, 2020-21లో 39.94 లక్షల టన్నులు సేకరించారు. ఈ ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించి ఫిబ్రవరి 25 నాటికి 35.94 లక్షలే కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే నాలుగు లక్షల టన్నులు, 2019-20తో పోలిస్తే 6.62 లక్షల టన్నులు సేకరణలో పౌరసరఫరాల సంస్థ వెనుకబడింది.
నిధులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం. నెల రోజుల నుండి డబ్బులు చెల్లించే ప్రక్రియ నిలిచిపోవడంతో సేకరణనూ అధికారులు నిలిపివేశారు. ఈ సీజన్లో మార్చి 22 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఫిబ్రవరి 27 సాయంత్రం నాలుగు గంటల సమయానికి 36.18 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. మరో 23 రోజుల్లో 13.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సిఉంది. అంటే రోజుకు దాదాపుగా 60 వేల టన్నుల ధాన్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమని చెబుతున్నారు. ఇటీవల పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 45 లక్షల టన్నుల వరకూ సేకరిస్తామని తెలిపారు. ఆ ప్రకటన అమలు కావడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.










