Jan 23,2023 21:38

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - లేపాక్షి : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మండలంలోని చోళ సముద్రం దగ్గర హైవే పై ఉన్న టోల్‌ గేట్‌ను మూసివేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఫిరంగి ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ టోల్‌ గేట్‌ లో మరుగు దోడ్లు, నీటి సౌకర్యం లేవన్నారు. మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. టోల్‌ గేట్‌ నిబంధనలు ప్రకారం అంబులెన్స్‌, త్రోయింగ్‌ వాహనం లేదన్నారు. అగ్నిమాపకానికి సంబంధించి కూడా అనుమతి లేదన్నారు. ప్రథమ చికిత్స చేయడానికి కూడా ఎలాంటి పరికరాలు లేవన్నారు. అయితే ప్రజలతో మాత్రం టోల్‌ గేట్‌ రుసుం వసూలు చేస్తున్నారని విమర్శించారు. కనీస వసతులు కల్పించేంత వరకు టోల్‌ గేట్‌ మూసివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మినారాయణ, క్రిష్ణ మూర్తి, లారీ డ్రైవరు శ్రీనివాసులు, గణేష్‌, రామచంద్ర, గంగాధరప్ప, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.