ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రసూతి ఆస్పత్రుల్లో ఎఆర్‌టి, ఐవిఎప్, సరోగసీ కేంద్రాల నిర్వహణ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలని, ఆ దిశగా యాజమాన్యాలు మార్పులు చేసుకోవాల్సి ఉందని డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టరు బొడ్డేపల్లి మీనాక్షి సూచించారు. సోమవారం తన కార్యాలయంలోని చాంబరులో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆమె సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆస్పత్రుల్లో నిబంధనలు అమలుకు పర్యవేక్షణ కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఎఆర్‌టి, ఐవిఎఫ్, సరోగసి క్లీనిక్‌లను నిర్వహించడానికి నిర్దేశించిన ఫీజులను ప్రభుత్వానికి చెందిన కెనరా బ్యాంకు ఖాతాకు జమ చేయాలని సూచించారు. ఇన్‌స్పెక్షన్ బృందాలు తనిఖీ చేసిన తర్వాత నివేదికలు డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో అందించాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గజిట్ కాఫీలను యాజమాన్యాలకు ఆమె అందజేశారు. సమావేశంలో అదనపు డిఎంఅండ్‌హెచ్‌ఒ ఎన్.అనురాధ, దానేటి శ్రీధర్, ఎం.సందీప్, ఎ.సంధ్య, మూల వెంకటరావు, దిలీప్ కుమార్, ఎఒ సువర్ణ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, వెంకటేశ్వర్లు, సూర్యకళ, మోహిని, తదితరులు పాల్గొన్నారు.










