ప్రజాశక్తి-బత్తలపల్లి జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల సంస్థ నిబంధనల మేరకు నష్టపరిహారం అందించన్నుట్లు ఆర్టీఓ తిప్పేనాయక్ తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో తహశీల్దార్ యుగేశ్వరీదేవి ఆధ్యక్షతన భూములు కోల్పోతున్న రైతులతో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ మండలంలో 6 పంచాయతీ గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారన్నారు. వీరందరికీ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుండి గడిచిన 3 సంవత్సరాల కాలంలో రిజిస్ట్రేషన్ జరిగిన సమయంలో ఉన్న రేటు ఆధారంగా పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. భూమితో పాటు చెట్లు, బోర్లు, బావులు, ఏవైనా నిర్మాణాలు ఉన్నా వాటికి కూడా ఆయా శాఖల నివేదిక ఆధారంగా ధర నిర్ణయిస్తారన్నారు. రెండు రోజుల్లో ఏ ఊరిలో ఎంత రేటు నిర్ణయించింది తహశీల్దార్ కార్యాలయంలో తెలుసుకోవచ్చన్నారు. హైవే నిర్మాణంలో జాయింట్ కలెక్టర్‌కు అథారిటీ ఉంటుందన్నారు. ఆయన నిర్ణయించిన ధర రైతులకు అందివ్వనున్నట్లు తెలిపారు. అయితే దేశానికి అన్నం పెట్టే రైతుకు తక్కువ చేయకుండా, మరీ రైతులు ఆశించినంత కాకుండా రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువలను బేరీజు చేసుకుని పరిహారం ఉంటుందన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంంటే గ్రామంలోని ఐదుగురు రైతులు కలిసి అభ్యంతరాలను అర్జీ ద్వారా కలెక్టర్‌కు విన్నవించుకోవాలన్నారు. ఇందుకు రైతులు స్పందింస్తూ తమకు తల్లిదండ్రులతో సమానమైన భూములను ప్రభుత్వానికి తక్కువ ధరకు ఇచ్చుకోలేమన్నారు. అలాగని ప్రజలకు అవసరమైన రోడ్లు నిర్మాణానికి భూములు ఇవ్వలేమని చెప్పలేమన్నారు. మార్కెట్ విలువను ఆధారం చేసుకుని పరిహారం అందించాలన్నారు. అలాగే రహదారి వచ్చే భూముల్లో పైపులైన్లు ఏర్పాటు చేసుకున్నామని వాటికి పరిహారం అందించాలని కోరగా పైపులైనుకు ఇవ్వలేమన్నారు. ఈ కార్యక్రమంలో హైవే అథారిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ధనలక్ష్మి, వైసిపి మండల కన్వీనర్ బయపరెడ్డి, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో తిప్పేనాయక్










